ఢిల్లీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు
బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ ప్రాంతంలో ఫ్లెక్సీలను విరివిగా ఏర్పాటు చేశారు. ఆయా ఫ్లెక్సీలను ఇప్పుడు ఎన్‌డీఎంసీ అధికారులు అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారంటూ తొలగించడం గమనార్హం
న్యూఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అక్కడి అధికారులు మంగళవారం ఉదయం తొలగించారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని, అందుకే వాటిని తొలగించామని న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ) అధికారులు తెలిపారు. ఈనెల 14వ తేదీ (బుధవారం)న బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం నిర్వహించనున్న విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. ఇందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రారంభోత్సవంలో భాగంగా 13, 14 తేదీల్లో యాగం చేయనున్నారు. యాగం నిర్వహించనున్న యాగశాలలో మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొననున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆ ప్రాంతంలో ఫ్లెక్సీలను విరివిగా ఏర్పాటు చేశారు. ఆయా ఫ్లెక్సీలను ఇప్పుడు ఎన్‌డీఎంసీ అధికారులు అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారంటూ తొలగించడం గమనార్హం.