ఢిల్లీలో ప్రకటనల యుద్ధం.. ప్రభుత్వంతో గవర్నర్ కయ్యం
ఢిల్లీ కార్పొరేషన్ లో బీజేపీ ఘోర పరాభవం తర్వాత లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఈ ఆదేశాలిచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడుతోంది.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వంతో లెఫ్ట్ నెంట్ గవర్నర్ చీటికీ మాటికీ కయ్యానికి దిగుతున్నారు. ఆమధ్య మద్యం విధానం, ఉచిత విద్యుత్ పథకంపై కూడా లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ప్రభుత్వ ప్రకటనలపై చిందులు తొక్కారు. ప్రభుత్వ ప్రచారం చేసుకోవాల్సింది పోయి, ప్రకటనల ద్వారా పార్టీ ప్రచారం చేసుకున్నారని, ఇతర రాష్ట్రాల్లో ఢిల్లీ పథకాల ప్రచారం అవసరమేముందని ప్రశ్నించారు. ప్రచారం కోసం ఉపయోగించిన 97కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రికవరీ చేయాలని చీఫ్ సెక్రటరీకి సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించారు..
ప్రభుత్వ ప్రకటనలపై 2016లో ఏర్పాటు చేసిన కమిటీ మార్గదర్శకాలను ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఉల్లంఘించిందని అన్నారు వీకే సక్సేనా. ప్రచారం, ప్రకటనల విషయంలో సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టులు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారని ఆరోపించారు. వెంటనే ప్రకటనలకోసం ప్రభుత్వం ఖర్చు పెట్టిన సొమ్ముని ఆమ్ ఆద్మీ పార్టీనుంచి రికవరీ చేయాలన్నారు.
కార్పొరేషన్ ఎన్నికలు తేడాకొట్టినందుకా..?
ఢిల్లీ కార్పొరేషన్ లో బీజేపీ ఘోర పరాభవం తర్వాత లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఈ ఆదేశాలిచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడుతోంది. ఆ పరాజయాన్ని జీర్ణించుకోలేని బీజేపీ, గవర్నర్ తో ఇలా తప్పుడు ఆరోపణలు చేయిస్తోందని, తమ పార్టీని టార్గెట్ చేయాలని చూస్తోందని ఆరోపించారు ఆప్ నేతలు. అసలు లెఫ్ట్ నెంట్ గవర్నర్ కి ఆ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రకటనలు ఇచ్చే అధికారం ఆయా రాష్ట్రాలకు ఉంటుందని, ఇతర రాష్ట్రాల్లో అధికార పార్టీలు కూడా ఇదే పని చేస్తున్నాయని ఆప్ నేతలు వివరణ ఇచ్చారు. అక్కడ లేని నిబంధనలు ఇక్కడే ఎందుకని అన్నారు. అందులోనూ తన అధికార పరిధిని మించి ఎల్జీ ఇలాంటి ఆదేశాలివ్వడం సరికాదంటున్నారు.