జామా మసీదులోకి మహిళలకు నో ఎంట్రీ.. వివాదాస్పదమవుతున్న నిర్ణయం

మసీదు యాజమాన్యం నిర్ణయం వివదాస్పదం కావడంతో షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ వివరణ ఇచ్చారు. వారసత్వ కట్టడమైన జామా మసీదులో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Advertisement
Update:2022-11-24 17:41 IST

ఢిల్లీలోని ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశం జామా మసీదులోకి ఒంటరి లేదా గుంపుగా వచ్చే మహిళలకు ప్రవేశం నిషేధిస్తూ కమిటీ నిర్ణయం తీసుకున్నది. ఇకపై మగతోడు లేకుండా వచ్చే మహిళలను మసీదులోకి రానివ్వబోమని.. అలాగే మసీదు ప్రాంగణంలో సంగీతంతో కూడిన వీడియోలు (రీల్స్) చిత్రీకరించడం కూడా నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై వివాదం చెలరేగుతోంది. మహిళలను అవమానించేలా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ వస్తోంది. ప్రార్థనా స్థలంలోకి రావడానికి మహిళలకు ఎందుకు ఎంట్రీ ఉండదని ప్రశ్నిస్తున్నారు.

మసీదు యాజమాన్యం నిర్ణయం వివదాస్పదం కావడంతో షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ వివరణ ఇచ్చారు. వారసత్వ కట్టడమైన జామా మసీదులో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జామా మసీదులో ప్రార్థనలు చేసుకోవడానికి అందరికీ ఆహ్వానం ఉందని తెలిపారు. అయితే అమ్మాయిలు ఒంటరిగా వచ్చి, మసీదు ప్రాంగణంలో తమ భాగస్వాముల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రదేశం అందుకోసం నిర్మించబడలేదు. మసీదైనా, గుడైనా, గురుద్వారా అయినా.. కేవలం ప్రార్థనల కోసం మాత్రమే నిర్మిస్తారు. వాటి కోసం వచ్చే ఎవరికైనా ప్రవేశం ఉంటుందని ఆయన చెప్పారు.

మహిళలు తమ కుటుంబాలతో, భర్తతో వస్తే ఎలాంటి నిషేధం ఉండదు. కానీ కొంత మంది అమ్మాయిలు దీన్ని ఒక మీటింగ్ పాయింట్‌లా మార్చేశారు. తమ ప్రియుడి కోసం వెయిట్ చేస్తున్నారు. కొంత మంది ఇక్కడ రీల్స్ చేస్తూ దీని పవిత్రతను పాడు చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు పెరిగిపోయాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మసీదు పీఆర్వో సబియుల్లా ఖాన్ వివరించారు.

మసీదు యాజమాన్యం నిర్ణయంపై పలు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఇదొక దూకుడైన చర్యగా ఆమె అభివర్ణించారు. మసీదులోకి ఒంటరి మహిళలను రాకుండా నిషేధించడం తప్పుడు చర్య అన్నారు. మసీదు కమిటీ తీసుకున్న నిర్ణయంపై నోటీసులు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మహిళలు మసీదులోకి రాకుండా నిర్ణయం తీసుకోవడానికి ఎవరికీ హక్కు లేదని ఆమె తెలిపారు.

ఒంటరి మహిళలకు, పురుషులతో రాని అమ్మాయిలకు మసీదులోకి ఎంట్రీ ఎందుకు నిషేధించారో తెలియజేయాలని, ఈ నిర్ణయం వెనుక ఉన్న వ్యక్తి ఎవరో చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఈ నెల 28లోగా మహిళా కమిషన్‌కు అందజేయాలని మసీదు కమిటీకి నోటీసులు జారీ చేశారు. అలాగే వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కూడా పేర్కొన్నారు.





Tags:    
Advertisement

Similar News