ఢిల్లీని కొన్ని ముఠాలు నడిపిస్తున్నయ్.. దాడులకు తెగబడుతున్నయ్
ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ హాట్ కామెంట్స్
ఢిల్లీని కొన్ని ముఠాలు నడిపిస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ఆయన పరోక్షంగా బీజేపీపై హాట్ కామెంట్స్ చేశారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలు క్షీణించాయని, వ్యాపారులపై గ్యాంగ్‌స్టర్లు దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ఢిల్లీలో నిత్యం ఏదో ఒక చోట కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఢిల్లీ శివారుల్లో దాడులు, దోపిడీలకు పాల్పడుతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రక్షిస్తోందని ఆరోపించారు. బీజేపీ రక్షణ లేకుంటే అలాంటి గ్యాంగులు ఎలా రెచ్చిపోతున్నాయని ప్రశ్నించారు. ఢిల్లీలో శాంతిభద్రతల పర్యవేక్షణ కేంద్రం చేతుల్లో ఉందని, ఆ కేంద్ర ప్రభుత్వం దీనిపై ఉదాసీనంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీని టార్గెట్ చేస్తూ అసెంబ్లీ సమావేశాల్లో కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అంతకుముందు బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు విజేందర్ గుప్తా మాట్లాడుతూ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. స్పీకర్ ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయడంతో మిగిలిన బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.