ఢిల్లీ పరిస్థితి అత్యంత ప్రమాదకరం.. వరద నీటిలో కేజ్రీవాల్ నివాసం
లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయా ప్రాంతాలను విడిచి పెట్టాలని, పునరావాస శిబిరాలకు రావాలని సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అయితే స్వయానా ఇప్పుడు ఆయన ఇంటి దగ్గరకు కూడా వరదనీరు రావడం విశేషం.
దేశ రాజధాని ఢిల్లీని యమునా నది వరద ప్రవాహం చుట్టుముట్టింది. గతంలో కనీసం వాన నీరు కూడా నిలబడని ప్రాంతాలు నేడు జలమయం అయ్యాయి. యమునా నది ప్రవాహం అత్యంత ప్రమాదకర పరిస్థితికి చేరుకుంది. సీఎం కేజ్రీవాల్ నివాసం వైపు కూడా వరదనీరు వచ్చింది. ఢిల్లీ సచివాలయంలోకి కూడా వరదనీరు చేరింది, అసెంబ్లీకి 500 మీటర్ల దూరంలోకి వరద వచ్చింది.
యమునా నది గరిష్ట ప్రవాహ రికార్డ్ 207.49 మీటర్లు. 1978లో వచ్చిన భీకర వరదలకు యమున ప్రవాహం ఢిల్లీని చుట్టుముట్టింది. ఇప్పుడది 208.51 మీటర్లకు చేరింది. అంటే అత్యంత ప్రమాదకరం కంటే మరో మీటరు ఎక్కువగానే వరద ప్రవాహం చేరింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయా ప్రాంతాలను విడిచి పెట్టాలని, పునరావాస శిబిరాలకు రావాలని సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అయితే స్వయానా ఇప్పుడు ఆయన ఇంటి దగ్గరకు కూడా వరదనీరు రావడం విశేషం.
సాయంత్రానికి తగ్గేనా..?
ప్రస్తుతం ఢిల్లీలో వర్షాలు లేవు, హర్యాణాలో కూడా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే హర్యాణాలోని హత్నీకుండ్ రిజర్వాయర్ నుంచి నీటిని యధావిధిగా కిందకు వదులుతుండటంతో వరద ప్రవాహం ఏమాత్రం తగ్గలేదు. సాయంత్రానికి ఆ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల తగ్గవచ్చని చెబుతున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.
మరోవైపు ఢిల్లీలో రోడ్లపై వరదనీరు చేరుకుంది. సివిల్ లైన్స్ ప్రాంతంలో రింగ్ రోడ్డు పూర్తిగా నీటమునిగింది. కాశ్మీరీ గేట్ - మంజు కా తిలాని కలిపే ప్రాంతంలో భారీగా వరద చేరి వాహనాల రాకపోకలకు నిలిచిపోయాయి. 12 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు సెలవలు ప్రకటించారు.