బీజేపీ, కాంగ్రెస్ ఏకమై మాపై కుట్రలు చేస్తున్నాయి.. - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఈ ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో ఎన్నికలపై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కొద్ది రోజులుగా గుజరాత్ రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఏకమై తనపై, ఆమ్ ఆద్మీ పార్టీపై కుట్రలు చేస్తున్నాయని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. గుజరాత్ పర్యటనలో భాగంగా మంగళవారం వడోదర విమానాశ్రయానికి చేరుకున్న కేజ్రీవాల్‌కు కొంతమంది వ్యక్తుల నుంచి ఎదురైన వ్యతిరేకతతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో ఎన్నికలపై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కొద్ది రోజులుగా గుజరాత్ రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా వడోదర విమానాశ్రయానికి చేరుకున్న కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులు `మోదీ.. మోదీ..` అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ, కాంగ్రెస్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను విమానాశ్రయానికి వస్తే.. తనకు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు `మోదీ.. మోదీ` అంటూ నినాదాలు చేశారని చెప్పిన కేజ్రీవాల్.. రాహుల్ గాంధీ గుజరాత్‌లో పర్యటించిన సందర్భంగా ఎప్పుడూ ఇలా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయలేదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఈ కుట్రలు చేస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.
గుజరాత్‌లో ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి పెను సవాలు ఎదురవనుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. గతంలో పట్టణ ప్రాంతాల్లోని 66 సీట్లలో బీజేపీ ఎప్పుడూ ఓడిపోలేదని, ఇప్పుడు మాత్రం ఆ పార్టీకి ఆయా స్థానాల్లో ఓటమి తప్పదని స్పష్టం చేశారు.
మరోపక్క గుజరాత్‌లో పాత పింఛను విధానాన్ని అమలు చేయాలంటూ ఆందోళన చేస్తున్న ఉద్యోగులను ఆకట్టుకునేందుకు కేజ్రీవాల్ హామీల జల్లు కురిపించారు. రానున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే.. పాత పింఛను విధానాన్ని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఉద్యోగుల పింఛను విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందున్నది ఆసక్తిగా మారింది.