జిమ్ లో మరో మరణం.. కారణం హార్ట్ ఎటాక్ కాదు
ఎప్పటిలాగే ఈరోజు కూడా జిమ్ కి వచ్చాడు. ట్రెడ్ మిల్ ఎక్కాడు. కాసేపు రన్నింగ్ చేసి, ఉన్నట్టుండి కుప్పకూలాడు. నిస్తేజంగా పడిపోయి ఉన్న అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు, అప్పటికే అతను చనిపోయినట్టు నిర్థారించారు వైద్యులు.
వ్యాయామ శాలలు వ్యా'యమ'శాలలుగా మారుతున్నాయి. ఇటీవల జిమ్ లలో తరచూ గుండెపోటు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వ్యాయామం చేస్తూనే కుప్పకూలడం, లేదా వ్యాయామం చేసి ఇంటికొచ్చిన తర్వాత గుండెపోటుతో దుర్మరణం చెందటం, అది కూడా పాతికేళ్ల వయసువారే అధికంగా ఇలాంటి ఘటనలకు గురికావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఢిల్లీలో 24ఏళ్ల ఓ యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జిమ్ లోనే ప్రాణాలు వదిలాడు.
ఉత్తర ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో సెక్టార్-15లో జింప్లెక్స్ ఫిట్ నెస్ జోన్ ఉంది. ఉదయాన్నే ఇక్కడికి యువత వ్యాయామం కోసం వస్తుంటారు. 24 ఏళ్ల సాక్షం పృథ్వి అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కూడా రోజూ ఈ జిమ్ కి వస్తుంటాడు. ఎప్పటిలాగే ఈరోజు కూడా జిమ్ కి వచ్చాడు. ట్రెడ్ మిల్ ఎక్కాడు. కాసేపు రన్నింగ్ చేసి, ఉన్నట్టుండి కుప్పకూలాడు. నిస్తేజంగా పడిపోయి ఉన్న అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు, అప్పటికే అతను చనిపోయినట్టు నిర్థారించారు వైద్యులు. కరెంటు షాక్ తో పృథ్వి చనిపోయాడని తేల్చారు.
పృథ్వి జిమ్ చేస్తున్నప్పుడు సడన్ గా ట్రెడ్ మిల్ కి కరెంట్ పాస్ అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో జిమ్ ఓనర్ అనుభవ్ దుగ్గల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. జిమ్ ని సీజ్ చేశారు. ఢిల్లీలో ఇటీవల భారీ వర్షాలకు పాత భవనాల గోడలు చెమ్మ పట్టాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోహిణి ప్రాంతంలోని జిమ్ కూడా సెల్లార్ లాంటి ప్రాంతంలో ఉంది. వర్షం కారణంగానే ట్రెడ్ మిల్ కి కరెంట్ పాస్ అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. జిమ్ కి వెళ్లేవారు ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.