హిందూ నేతలే లక్ష్యంగా దావూద్ గ్యాంగ్ కుట్రలు- NIA వెల్లడి
దేశంలో పలువురు హిందూ నాయకులను హత్య చేయడానికి దావూద్ గ్యాంగ్ కుట్రపన్నుతోందని NIA వెల్లడించింది. ఇటీవల NIA దావూద్ గ్యాంగ్ కు చెందిన మహ్మద్ సలీం అలియాస్ సలీమ్ ఫ్రూట్‌ను అరెస్టు చేసింది.
దేశంలో మళ్ళీ అల్లకల్లోలం సృష్టించేందుకు దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇటీవల అరెస్టు చేసిన వారినుంచి సేకరించిన సమాచారంతో భారత్ లో మరోసారి పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలు, విధ్వంసం జరిపేందుకు కుట్రలు జరుగుతున్నాయని జాతీయ దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.. ఈ సారి హిందూ నేతలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు చేయాలనే ప్లాన్ వేసినట్టు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
స్మగ్లింగ్, నార్కో టెర్రరిజం, మనీలాండరింగ్, నకిలీ కరెన్సీని చెలామణి చేయడం, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమీకరించడం వంటి కేసులకు సంబంధించి మహ్మద్ సలీం అలియాస్ సలీమ్ ఫ్రూట్‌ను ఈ వారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) అరెస్టు చేసింది. సలీం డి-కంపెనీకి సన్నిహితుడు,దావూద్ ఇబ్రహీం కుడిభుజం చోటా షకీల్ పేరుతో భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయడంలో చురుకైన పాత్ర పోషించాడు. అంధేరీలోని వెర్సోవా నివాసి పర్వేజ్ జుబెర్ వాయెద్ మెమన్ ను ఉగ్రవాద చర్యల కోసం నిధులు సేకరించిన ఆరోపణలపై మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) అరెస్టు చేసింది. అతను దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం సహచరుడు. భారతదేశంలో తీవ్రవాద దాడులను నిర్వహించేందుకు డి-కంపెనీకి ఐఎస్ఐ బాధ్యతలు అప్పగించిందని వివిద దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. డి-గ్యాంగ్ కు దేశంలోని అనేక ప్రాంతాలలో విస్తృతమైన నెట్‌వర్క్ ఉంది.వాటిని టెర్రర్ మాడ్యూల్స్‌గా మరింతగా మార్చి భారత్ లో ఉగ్రవాదానికి పాల్పడాలని ఐఎస్ఐ కోరిందని సమాచారం.
కొద్ది రోజుల క్రితం దావూద్ మేనల్లుడు డానిష్ అహ్మద్ అనే వ్యక్తి ఢిల్లీ కోర్టులో వాంగ్మూలం ఇస్తూ.. 40 ఏకే-47 రైఫిళ్లను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చారని తెలిపాడు. వారు రష్యన్ ఏజెంట్‌తో సంప్రదింపులు జరిపారని, అయితే ఈ ఆయుధాలను ముంబై, జమ్మూ కాశ్మీర్‌లో దాడులకు ఉపయోగించబోతున్నారని ఏజెంట్‌కు తెలియడంతో ఒప్పందం కుదరలేదని చెప్పాడు.
ఈ పరిణామాలన్నీపాక్ ఆశ్రయం పొందుతున్న దావూద్ తో ఉన్న లింకులను నిరూపిస్తున్నాయి. అయితే అతను తమ దేశంలో లేడంటూ పాకిస్తాన్ బుకాయిస్తోంది. దావూద్ మాదక ద్రవ్యాల వ్యాపారం ద్వారా సంపాదించే డబ్బుతో ఐఎస్ ఐతో పాటు అనేక ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూరుస్తున్నందున దావూద్ ను పాకిస్తాన్ గొప్ప ఆస్తిగా భావిస్తోంది. తీవ్రవాద కార్యకలాపాలతో పాటు నాయకులనే లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడాలనే యోచన కూడా ఉందని దర్యాప్తు సంస్థలకు సమాచారం ఉందట. వారి రాడార్‌లోని లక్ష్యాలు ముఖ్యంగా రాజకీయ నాయకులు, హిందూ నాయకులేనని ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఆర్ ఎస్ ఎస్ నేతలే లక్ష్యం
ఈ క్రమంలోనే ముంబైలో ఎన్‌ఐఏ ఈ ముఠాకు చెందిన మాడ్యూల్‌ను చేధించింది. దేశంలోని టార్గెట్ల కోసం గాలిస్తున్న ఈ గ్యాంగ్ కు షకీల్ డబ్బులు పంపుతున్నట్లు తెలిపింది. హిందూ నాయకులను చంపడానికి షార్ప్ షూటర్లను నియమించిన మరో గ్యాంగును కూడా ఏజెన్సీలు ఛేదించగలిగాయి. వీరి హిట్ లిస్ట్‌లో ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ సభ్యులు ఉన్నట్లు తెలిసింది. ఈ మొత్తం ఆపరేషన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు రసూల్ పార్టీ ప్లాన్ చేశాడు (ఇతనికి రసూల్‌ఖాన్, ఆయుబ్ ఖాన్ పఠాన్ వంటి పేర్లు కూడా ఉన్నాయి). ఇంటెలిజెన్స్ బ్యూరో డిసెంబర్ 2018 నుండి రసూల్ పార్టీ, షార్ప్‌షూటర్ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను ట్రాక్ చేస్తోంది. వారిలో ఒకరు ఆఫ్ఘన్ జాతీయుడు కాగా, మరొకరు కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందినవారు.
రసూల్ పార్టీ చాలా కాలంగా దర్యాప్తు ఏజెన్సీల నిఘాలో ఉన్నాడు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యకేసులో ఇతను కీలక సూత్రధారి. గుజరాత్, హైదరాబాద్ నుండి అనేక మంది యువకులను బంగ్లాదేశ్‌లోని టెర్రర్ మాడ్యూల్‌కు పంపడంలో కీలక పాత్ర పోషించాడు.