పంజాబీ సింగ‌ర్ దలేర్ మెహందీకి 2 సంవత్సరాల జైలు శిక్ష

ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీకి పాటియాలా కోర్టు గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దలేర్ కోర్టును క్షమాపణ కోరినా కోర్టు అంగీకరించలేదు.

Advertisement
Update:2022-07-14 21:07 IST

ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీకి పాటియాలా కోర్టు గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దలేర్ కోర్టును క్షమాపణ కోరినా కోర్టు అంగీకరించలేదు. 2003నాటి మానవ అక్రమ రవాణా కేసులో ఆయ‌న‌కు ఈ జైలు శిక్ష విధించింది. బెయిల్ కోసం ఆయన చేసిన దరఖాస్తును కూడా పాటియాలా కోర్టు తిరస్కరించింది. అతన్ని పాటియాలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని పాటియాలా జైలుకు పంపారు.

కేసు వివ‌రాలిలా ఉన్నాయి.

విదేశాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు వెళ్లినప్పడు కొందరిని తన ట్రూప్ సభ్యులుగా తీసుకెళ్లి, వారిని అక్కడే వదిలేసేవారు. ఇలా విదేశాలకు తీసుకెళ్లినందుకు వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేసేవారు. ముఖ్యంగా అమెరికా, కెనడాలకు వీరు మ‌నుషుల‌ను తీసుకెళ్లేవారు. తన సోదరుడు శంషేర్ సింగ్ మెహందీతో కలిసి దలేర్ మెహందీ ఈ పని చేసినట్టు పోలీసులు అభియోగాలు మోపారు.

తమ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని, ఆ తర్వాత తమను విదేశాలకు తీసుకెళ్లలేదని చాలా మంది దలేర్ సోదరులపై ఆరోపణలు చేశారు. ఇలాంటి వారిలో ఒకరైన బక్షీష్ సింగ్ 2003లో పటియాలాలో దలేర్ పై కేసు పెట్టారు.ఆయనతో పాటు ఆయన సోదరుడు శంషేర్ సింగ్‌కు వ్యతిరేకంగా 2003 లో మొత్తం 31 కేసులు నమోదయ్యాయి. దలేర్ సోదరుడు శంషేర్ మెహందీ 2017లో మృతి చెందారు.

దలేర్ మెహందీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతమందించిన చిత్రాలలో పలు పాటలు పాడారు. రాజమౌళి తీసిన యమదొంగ సినిమాలో రబ్బరు గాజులు, బాహుబలి టైటిల్ ట్రాక్, ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బాద్‌షా చిత్రంలో బంతిపూల జానకి వంటి హిట్ సాంగ్స్ పాడారు.

Tags:    
Advertisement

Similar News