కొట్టుకుపోతున్న కార్లు, సబ్ వేల్లోకి నీళ్లు.. మిచౌంగ్ ధాటికి చెన్నై విలవిల

Advertisement
Update:2023-12-04 14:16 IST

మిచౌంగ్ తుపాను ధాటికి చెన్నై విలవిల్లాడుతోంది. తమిళనాడు, ఏపీపై తుపాను ప్రభావం ఉన్నా.. ముఖ్యంగా చెన్నై భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. అంతకంతకూ వర్షం పెరుగుతుండతంటో.. చెన్నైలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల కార్లు వరదనీటిలో కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైలో స్కూళ్లు మూసివేశారు. నగరంలోని కోర్టులకు సెలవు ఇచ్చినట్లు మద్రాస్‌ హైకోర్టు ప్రకటించింది. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చెన్నై విలయంపై సానుభూతి తెలుపుతూ పలువురు ట్వీట్లు వేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా చెన్నైలో కార్లు కొట్టుకుపోతున్న వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.


సబ్ వేలు మూత..

14 రైల్వే సబ్‌ వేల్లోకి నీరు చేరడంతో వాటిని మూసివేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చెన్నైలో సహాయక చర్యలు మొదలుపెట్టాయి. వరద నీటిలో చిక్కుకొన్న 15 మందిని కాపాడాయి. పలు సబ్ వేల వద్ద కార్లు నీళ్లలో ఆగిపోయాయి. ప్రధాన రైళ్లతోపాటు, సబర్బన్ రైళ్లను కూడా ఆపివేశారు అధికారులు. నగరంలోని పలు పల్లపు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కాంతూరు ప్రాంతంలో గోడకూలి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కిల్పా మెడికల్ కాలేజీ గ్రౌండ్ ఫ్లోర్ లోకి వర్షపు నీరు చేరడంతో రోగుల్లో భయం మొదలైంది.


వలసరవాక్కంలో 154 మిల్లీమీటర్లు, చోలింగనల్లూరులో 125 మిల్లీమీటర్లు, కోడంబాక్కంలో 123 మిల్లీమీటర్లు, నుంగంబాక్కంలో 101 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెన్నైలో ప్రజా రవాణా కూడా స్తంభించింది. ప్రైవేటు వాహనాలు కూడా తక్కువగానే రోడ్లపైకి వస్తున్నాయి. మరోవైపు తుపానుతో పలు విమాన సర్వీసులు కూడా రద్దు చేశారు. రన్ వే పైకి కూడా నీరు చేరడంతో.. ఎయిర్ పోర్ట్ లోనే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 


Tags:    
Advertisement

Similar News