గోమూత్రం వల్ల మనుషుల ఆరోగ్యానికి హానికరం... IVRI పరిశోధనలో వెల్లడి

ఆవు మూత్రం తాగడం మనిషికి ఎంత ప్రమాదకరమో భారత్ కే చెందిన ఓ పరిశోధన ఇప్పుడు బైటపెట్టింది. ఎప్పటినుంచో ఎంతో మంది నిపుణులు చెప్తున్నప్పటికీ పట్టించుకోని వారికోసం ఈ పరిశోధన అనేక వివరాలు తెలిపింది.

Advertisement
Update:2023-04-11 20:55 IST

ఆవు మూత్రం తాగితే క్యాన్సర్ నయమవుతుంది... టీబీ తగ్గుతుంది.... అల్సర్ తగ్గుతుంది... చర్మవ్యాధులు తగ్గుతాయి... ఇంకా అనేక రకాల వ్యాధులు తగ్గుతాయి.... ఇవి కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు పనిగట్టుకొని చేస్తున్న ప్రచారం. దీనికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేనప్పటికీ ఈ ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా సాగుతూ ఉంటు‍ంది. కొందరు రాజకీయ నాయకులు బహిరంగ సభల్లో ఆవు మూత్రం గొప్పతనం పై ఉపన్యాసాలు దంచుతూ ఉంటారు. కొందరు ఆ మూత్రాన్ని తాగుతూ, మరి కొందరు దానితో స్నానం చేస్తూ ప్రదర్శనిలిస్తూ ఉంటారు.

అయితే ఆవు మూత్రం తాగడం మనిషికి ఎంత ప్రమాదకరమో భారత్ కే చెందిన ఓ పరిశోధన ఇప్పుడు బైటపెట్టింది. ఎప్పటినుంచో ఎంతో మంది నిపుణులు చెప్తున్నప్పటికీ పట్టించుకోని వారికోసం ఈ పరిశోధన అనేక వివరాలు తెలిపింది.

ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IVRI) నేతృత్వంలోని ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ఆరోగ్యకరమైన ఆవులు, ఎద్దుల మూత్రం నమూనాలలో కనీసం 14 రకాల హానికరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఈ బాక్టీరియాలో ఎస్చెరిచియా కోలి ఉంటుంది, ఇది అతిసారం, విరేచనాలు, వాంతులు కలిగిస్తుంది.ఆవు మూత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానవ వినియోగానికి పనికిరాదని ఈ అధ్యయనం తేల్చింది.

ఆన్‌లైన్ రీసెర్చ్ వెబ్‌సైట్ రీసెర్చ్‌గేట్‌లో ప్రచురించిన ఈ కొత్త అధ్యయనం , ఆవు, ఎద్దు మూత్రం కన్నా గేదె మూత్రం కొంత నయమని చెప్పింది.

ప్రధాన పరిశోధకుడు భోజ్ రాజ్ సింగ్ ప్రకారం, ఆవులు, గేదెలు, మానవుల యొక్క 73 మూత్ర నమూనాల గణాంక విశ్లేషణ ప్రకారం గేదె మూత్రంలో యాంటీ బాక్టీరియల్ చర్య ఆవు మూత్రం కంటే చాలా గొప్పదని సూచించింది. స్టెఫిలోకాకస్ ఎపిడెర్మిడిస్, ఎర్వినియా రాపోంటిసి వంటి బ్యాక్టీరియాపై గేదె మూత్రం మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

సాహివాల్, థార్‌పార్కర్, బృందావని అనే మూడు రకాల ఆవుల మూత్ర నమూనాలను పరిశోధకులు సేకరించారని సింగ్ చెప్పారు.

మానవ వినియోగానికి మూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సిఫార్సు చేయలేమని, కొంతమంది వ్యక్తులు పేర్కొన్నట్లుగా డిస్టిల్డ్ యూరిన్‌లో ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఉందా అనే దానిపై బృందం తదుపరి పరిశోధనలు చేస్తోందని సింగ్ చెప్పారు.

ఈ పరిశోధనపై బికనీర్‌లోని భారతీయ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధికారి డాక్టర్. ఎన్ఆర్ రావత్ మాట్లాడుతూ.. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అనేది జంతువులపై పరిశోధనలు చేస్తున్న ఒక పెద్ద సంస్థ అని, అలాంటి అధ్యయనం చెప్పిన విషయాన్ని తప్పు పట్టలేమని అన్నారు. ఇంతకు ముందు కూడా ఆవు మూత్రం వల్ల కలిగే హాని గురించి కొన్ని నివేదికలు చెప్పాయని, గోమూత్రం సంతానలేమితో బాధపడేవారికి హాని చేస్తుందని కూడా కొన్ని పరిశోధనల్లో వెల్లడైందని అన్నారు.

ఈ పరిశోధన మరింతగా జరగాలని ఆయన అన్నారు. గేదె మూత్రం ఎంత వరకు ఉపయోగపడుతుందో కూడా మరోసారి తేల్చాల్సి ఉందని అన్నారు.

Tags:    
Advertisement

Similar News