వార్నింగ్ బెల్.. నేటినుంచి దేశవ్యాప్తంగా కొవిడ్ మాక్ డ్రిల్

కొవిడ్ ఉగ్రరూపం దాలిస్తే అసలు మన ఆస్పత్రుల్లో ఉన్న సౌకర్యాలు ఏంటి..? మన సన్నద్ధత ఎంత అనేది ఈ మాక్ డ్రిల్ ద్వారా తెలిసిపోతుంది.

Advertisement
Update:2023-04-10 07:26 IST

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి, ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే ముందు ముందు కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందనే అంచనాలున్నాయి. ఈ దశలో రోజువారీ కేసుల వివరాలు బయటపెడుతూ కేంద్రం, రాష్ట్రాలను అలర్ట్ చేస్తోంది. తాజాగా కొవిడ్ మాక్ డ్రిల్ కోసం ఏర్పాట్లు చేసింది. ఈరోజు, రేపు దేశవ్యాప్తంగా కొవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఝజ్జర్‌ లోని ఎయిమ్స్ లో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ మాక్ డ్రిల్ ని స్వయంగా పర్యవేక్షిస్తారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ మాక్ డ్రిల్స్‌ ను రాష్ట్ర ఆరోగ్య మంత్రులు పర్యవేక్షిస్తారు.

ఆస్పత్రుల సన్నద్ధత ఎంత..?

గతంలో కూడా ఇలాంటి కొవిడ్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఈసారి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ ప్రభుత్వం అలర్ట్ అయింది. కొవిడ్ ఉగ్రరూపం దాలిస్తే అసలు మన ఆస్పత్రుల్లో ఉన్న సౌకర్యాలు ఏంటి..? మన సన్నద్ధత ఎంత అనేది ఈ మాక్ డ్రిల్ ద్వారా తెలిసిపోతుంది. కొవిడ్ పేషెంట్లకు అందాల్సిన అత్యవసర సేవలు కూడా మాక్ డ్రిల్ ద్వారా మరోసారి సమీక్షించుకుంటారు.

దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 30వేలు దాటింది. రోజువారీ మరణాల సంఖ్య కూడా రెండంకెలకు చేరుకుంది. దీంతో కేంద్రం అప్రమత్తత ప్రకటించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు.. విమానాశ్రయాల్లో నిబంధనలు మొదలు పెట్టాయి. విదేశాలనుంచి వచ్చేవారికి కొవిడ్ పరీక్ష తప్పనిసరి చేశాయి. గుంపులలోకి వెళ్లే సమయంలో మాస్క్ ధరించాలనే నిబంధన పెట్టాయి. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు కొవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు అధికారులు. ఇప్పటికిప్పుడు ప్రమాదం ముంచుకొచ్చిందని చెప్పలేం కానీ, ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే మాత్రం ముందు జాగ్రత్త తప్పనిసరి అని చెప్పాల్సిందే. 

Tags:    
Advertisement

Similar News