కరోనా డేంజర్ బెల్స్.. అప్పుడు ఢిల్లీ, ఇప్పుడు బీహార్

ఇప్పటి వరకూ కొవిడ్ నిర్థారణ అయిన వారి సంఖ్య 11కి చేరుకుంది. వీరందరినీ హోటళ్లలోని గదుల్లో ఐసోలేషన్‌లో ఉంచినట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. కరోనా సోకిన వారిలో థాయ్‌ లాండ్‌, మయన్మార్‌, బ్రిటన్‌ కు చెందిన వారున్నారు.

Advertisement
Update:2022-12-27 09:11 IST

భారత్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయనే సంకేతాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా విదేశాలనుంచి వచ్చేవారితోనే ప్రమాదం ముంచుకొచ్చేలా ఉంది. బీహార్ లో మొత్తం 11మంది విదేశీ ప్రయాణికులకు కొవిడ్ సోకినట్టు నిర్థారించారు. వేరియంట్ ని కనిపెట్టేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కి పంపి పరీక్షలు చేయిస్తున్నారు.

రెడ్ జోన్ గా బీహార్..

బీహార్ లోని బుద్ధ గయలో బౌద్ధ గురువు దలైలామా ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి 40 దేశాల నుంచి దాదాపు 60 వేల మంది విదేశీ యాత్రికులు వస్తారని అంచనా. తుమ్ముతూ, దగ్గుతూ, ముక్కు చీదుకుంటూ వస్తున్న చాలామందిని గయ విమానాశ్రయంలోనే అధికారులు నిలువరిస్తున్నారు. వారికి పరీక్షలు చేసి కొవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయితే వెంటనే ఐసోలేషన్ కి పంపిస్తున్నారు. ఇప్పటి వరకూ కొవిడ్ నిర్థారణ అయిన వారి సంఖ్య 11కి చేరుకుంది. వీరందరినీ హోటళ్లలోని గదుల్లో ఐసోలేషన్‌లో ఉంచినట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. గయ రైల్వే స్టేషన్‌ లోనూ కరోనా పరీక్షలు పెంచుతున్నారు. కరోనా సోకిన వారిలో థాయ్‌ లాండ్‌, మయన్మార్‌, బ్రిటన్‌ కు చెందిన వారున్నారు.

అప్పట్లో ఢిల్లీ, ఇప్పుడు బీహార్..

అప్పట్లో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వేలాదిమంది ముస్లింలు తరలి వచ్చారు. వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. ఆ కార్యక్రమం కరోనా హాట్ స్పాట్ గా మారడం అప్పట్లో పెద్ద సంచలనం. సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి మత పరమైన కార్యక్రమమే కరోనా హాట్ స్పాట్ గా మారుతోంది. బీహార్ లో జరగబోతున్న బౌద్ధుల కార్యక్రమానికి వేలాదిమంది తరలి వస్తున్నారు. విదేశీయుల కారణంగా ఇక్కడ కొవిడ్ పుట్ట పగిలే అవకాశముందని అనుమానిస్తున్నారు.

భారత్ లో కరోనా రోజువారీ లెక్కలు మళ్లీ మొదలయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా కరోనా కేసులు, యాక్టివ్ కేసుల సంఖ్య, మరణాలు, ఖాళీగా ఉన్నబెడ్లు, డిశ్చార్జి అయినవారి సంఖ్య.. ఇలా కేంద్రం మళ్లీ లెక్కలు ప్రకటిస్తోంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 196 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో భారత్ లో క్రియాశీల కేసుల సంఖ్య 3,428కి పెరిగింది.

Tags:    
Advertisement

Similar News