మళ్లీ పెరిగిన కేసులు.. అసలు కారణం ఏంటి..?
2022 అక్టోబర్ 28న చివరిసారిగా 2,208 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. మళ్లీ ఈ ఏడాది మార్చి28న 2151 కేసులతో ఆ మార్క్ దాటేశాం.
కరోనా కేసుల కొత్త లిస్ట్ వచ్చేసింది. ఈమధ్య కేంద్రం మళ్లీ రోజువారీ కేసుల విడుదలపై ఫోకస్ పెంచింది. పెరుగుతున్న కేసులు ఓవైపు ఆందోళన కలిగిస్తున్నా.. మూడు వేవ్ లు దాటేసిన మనం భయాన్ని దరిచేర్చుకోకుండా అప్రమత్తంగా ఉండటం మేలని చెబుతున్నారు వైద్య నిపుణులు.
2వేల మార్క్ దాటేశాయి..
గడచిన 24 గంటల వ్యవధిలో 2,151 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడచిన 5నెలల లెక్క తీస్తే.. రోజువారీ కరోనా కేసులు ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే మొదటిసారి. మంగళవారం దేశవ్యాప్తంగా 1,42,497 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వారిలో 2151 మందికి పాజిటివ్ అని తేలింది. 2022 అక్టోబర్ 28న చివరిసారిగా 2,208 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. మళ్లీ ఈ ఏడాది మార్చి28న 2151 కేసులతో ఆ మార్క్ దాటేశాం.
యాక్టివ్ కేసుల పెరుగుదల..
కొత్త కేసుల నమోదు పెరగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. భారత్ లో ప్రస్తుతం క్రియాశీల కేసులు 11,903కు చేరాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.51 శాతం కాగా, రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. పాజిటివిటి రేటు 0.03గా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా వల్ల ఏడుగురు చనిపోయినట్టు నిర్థారించారు.
ఎందుకీ పెరుగుదల..?
దేశంలో ప్రస్తుతం ఇన్ ఫ్లూయెంజా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. H3N2 వైరస్ వ్యాప్తి కూడా పెరిగిందని అంటున్నారు. ఈ దశలో పరీక్షల సంఖ్య పెరిగింది. దీంతో సహజంగానే కేసుల సంఖ్య కూడా పెరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈసారి ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య మాత్రం అదుపులోనే ఉన్నట్టు తెలుస్తోంది. .