హర్యానా, జమ్మూకశ్మీర్‌లో కౌంటింగ్‌ షురూ

హర్యానాలో ఆధిక్యంలో హస్తం పార్టీ.. జమ్మూలో మెజారిటీ మార్క్‌ చేరేది ఎవరో?

Advertisement
Update:2024-10-08 08:48 IST

హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. దీనికోసం ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది. హర్యానాలో హాట్రిక్‌ సాధిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా.. అధికారం తమదేనని ఆశతో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నది. ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ దాదాపుగా హస్తం పార్టీ వైపే మొగ్గుచూపాయి. ఈ నేపథ్యంలో ఫలితాలపై ఇరుపార్టీల నేతలపై ఉత్కంఠ నెలకొన్నది.

హర్యానాలో ఆధిక్యంలో కాంగ్రెస్‌

ఈ నెల 5వ తేదీన ఒకే విడతలో హర్యానా అసెంబ్లీకి పోలింగ్‌ జరిగింది. 90 నియోజకవర్గాల్లో 1,031 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఎన్నికల్లో 67.9 శాతం పోలింగ్‌ నమోదైంది. 90 స్థానాలున్న ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ ఫిగర్‌ 46 కావాలి. పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉన్నది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 2ంకి పైగా కాంగ్రెస్‌, 15పైగా చోట్ల బీజేపీ ముందంజలో ఉన్నది. మరోవైపు మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని సీఎం నాయబ్‌సింగ్‌ సైనీ చెబుతుండగా..ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ముందస్తు వేడుకలకు సిద్ధమయ్యారు.

జమ్మూలో మెజారిటీ మార్క్‌ చేరేది ఎవరో?

జమ్మూకశ్మీర్‌లో 90 స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్థాన్‌ శరణార్థులు, వాల్మీకి సమాజ్‌, గూర్ఖా తెగలవారు మొదటిసారిఎన్నికల్లో ఓటు వేశారు. 2014లో పోలింగ్‌ 65.52 శాతం నమోదు కాగా.. ఈసారి 63. 45 శాతానికే పరిమితమైంది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా.. పీసీసీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా బటమాలూ నుంచి బరిలోకి దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర నౌషేరా నుంచి తన అదృష్టాన్నిపరీక్షించుకుంటున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నామినేట్‌ చేయనున్నారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్క్‌ 48కి చేరుకున్నది. నామినేటెడ్‌ ఎమ్మెల్యే అంశాన్ని ఎన్‌సీ, కాంగ్రెస్‌, పీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

దాదాపు పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేసిన సంగతి తెలిసిందే. నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని పేర్కొన్నా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు రావని సర్వేలో వెల్లడైనట్లు తెలిపాయి. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో బీజేపీ-పీడీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈసారి ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. జమ్మూకశ్మీర్‌లో ఎన్‌సీ ముందంజలో ఉన్నది. జమ్మూకశ్మీర్‌లో 12 చోట్ల ఎన్సీ, 10 చోట్ల బీజేపీ, కాంగ్రెస్‌ 4, పీడీపీ 1, ఇతరులు 1 చోట ముందంజలో ఉన్నారు. 

Tags:    
Advertisement

Similar News