కార్పొరేషన్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం.. ఢిల్లీలో పవర్ వార్..

కొత్తగా మరో 16 ల్యాండ్ ఫిల్ సైట్లను ఢిల్లీ కార్పొరేషన్ ప్రతిపాదించినట్టు సమాచారం. దీనిపై ఆప్ ప్రభుత్వం మండిపడుతోంది. ఆ 16 ప్రాంతాల్లో చెత్త పర్వతాలను నిర్మిస్తారా అని ప్రశ్నిస్తున్నారు కేజ్రీవాల్.

Advertisement
Update:2022-09-16 20:53 IST

Arvind Kejriwal

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నా.. కొన్ని విషయాల్లో మాత్రం బీజేపీదే పైచేయిగా ఉంటోంది. ముఖ్యంగా సీఎం కేజ్రీవాల్ తీసుకునే నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే సంస్కరణలను లెఫ్ట్ నెంట్ గవర్నర్ అడ్డుకుంటున్నారు. ఆయన బీజేపీ మనిషి కావడంతో అక్కడ సీఎం వర్సెస్ గవర్నర్ అనే పోరాటం ఓ రేంజ్ లో సాగుతోంది. ఇక ఢిల్లీ కార్పొరేషన్ పై కూడా బీజేపీ పెత్తనం కొనసాగుతోంది. వచ్చే ఏడాది మే వరకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD)లో బీజేపీదే అధికారం. ఆ తర్వాత ఎన్నికల్లో ఆప్ పాగా వేయాలని చూస్తోంది. కార్పొరేషన్ పై కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి పెత్తనం ఇస్తేనే ఢిల్లీ సుందర నగరంగా మారగలదని అంటున్నారు సీఎం కేజ్రీవాల్.

చెత్త డంపింగ్ యార్డ్ లతో మొదలైన గొడవ..

ఢిల్లీలో ఇప్పటికే మూడు ప్రాంతాల్లో చెత్త డంపింగ్ యార్డ్ లు ఉన్నాయి. వీటిని ల్యాండ్ ఫిల్ సైట్లు అంటారు. వాటి పరిసరాల్లో నివశించే పేదలు నిత్యం నకరం అనుభవిస్తుంటారు. ఆ దుర్వాసన భరించలేని విధంగా ఉంటుంది. కానీ ఘాజీపూర్, ఓఖ్లా, భల్స్వా ప్రాంతాలవారికి అది తప్పించుకోలేని నరకంగా మారింది. అయితే ఇప్పుడు కొత్తగా మరో 16 ల్యాండ్ ఫిల్ సైట్లను కార్పొరేషన్ ప్రతిపాదించినట్టు సమాచారం. దీనిపై ఆప్ ప్రభుత్వం మండిపడుతోంది. ఆ 16 ప్రాంతాల్లో చెత్త పర్వతాలను నిర్మిస్తారా అని ప్రశ్నిస్తున్నారు కేజ్రీవాల్.

ఢిల్లీని సుందర నగరంగా మార్చాలనే తపన ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి ఉందని, కానీ కార్పొరేషన్ పై తమకు అధికారం, అజమాయిషీ లేకపోవడంతో వారు తీసుకునే చెత్త నిర్ణయాలు చూస్తూ ఉండిపోవాల్సి వస్తోందన్నారు కేజ్రీవాల్. చెత్తపర్వతాల నగరంగా ఢిల్లీని మార్చేస్తున్నారంటూ మండిపడ్డారు. కొత్తగా ల్యాండ్ ఫిల్ సైట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతాల్లో ఆప్ నేతలు నిరసనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

వచ్చే ఏడాది కార్పొరేషన్ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతోంది. ఈ దఫా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం సీట్ల సంఖ్యను 272 నుంచి 250కి కేంద్రం కుదించింది. ఈ మేరకు ఢిల్లీ గెజిట్ నోటిఫికేషన్‌ కూడా వచ్చేసింది. ఈ ఎన్నికలను బీజేపీ, ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఢిల్లీ కార్పొరేషన్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే అధికారం ఇస్తే, నగరం రూపు రేఖల్ని మార్చి చూపిస్తామంటున్నారు కేజ్రీవాల్.

Tags:    
Advertisement

Similar News