గాయాలు లేకపోయినా మరణాలు.. కోరమాండల్ విషాదంలో కొత్తకోణం

ప్రమాద తీవ్రతకు ఓవర్‌ హెడ్‌ విద్యుత్‌ తీగలు తెగి బోగీలపై పడ్డాయి. దీంతో కొన్ని బోగీలకు కరెంట్ ప్రసారమైందని, 40మంది వరకు కరెంట్ షాక్ తో చనిపోయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

Advertisement
Update:2023-06-06 15:17 IST

కోరమాండల్ రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 278మంది మృతి చెందినట్టు అధికారిక సమాచారం. వీరిలో 40మంది ఒంటిపై గాయాలేవీ లేవు. కనీసం చిన్న చిన్న దెబ్బలు కూడా లేవు. మిగతావారిలో కొందరి శరీరాలు నుజ్జు నుజ్జయ్యాయి, మరికొందరి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి, ఇంకొందరి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. అయితే 40మంది మాత్రం ఒంటిపై ఎలాంటి గాయం లేకుండా ప్రాణాలు వదిలారు. వారి మరణానికి కారణం హై ఓల్టేజ్ కరెంట్ షాక్ అనే అనుమానాలు బలపడుతున్నాయి.

రెస్క్యూ ఆపరేషన్ అధికారి వెల్లడి..

ప్రమాదం తర్వాత పోలీసులు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, రైల్వే సిబ్బంది, స్థానికులు.. అందరూ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. గాయాలతో ఉన్నవారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు, ప్రాణాలు కోల్పోయిన వారిని బయటకు తీసి ఓ పక్కన ఉంచారు. రెస్క్యూ ఆపరేషన్ ని పర్యవేక్షించిన పోలీస్ అధికారి.. కొంతమంది మృతుల శరీరాలపై ఎలాంటి చిన్న గాయం కూడా లేదని చెప్పారు. గవర్నమెంట్ రైల్వే పోలీస్ లు కూడా తమ ఎఫ్ఐఆర్ లో ఈ విషయాన్ని పొందుపరిచారు. ప్రమాదం జరిగిన సమయంలో ఓవర్ హెడ్ విద్యుత్ కేబుల్ తెగి బోగీలపై పడిందని, దీంతో విద్యుత్ షాక్ జరిగిందని రైల్వే పోలీసులంటున్నారు.

కోరమాండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ గూడ్స్‌ రైలుని ఢీకొట్టిన తర్వాత కొన్ని బోగీలు ఎగిరిపడ్డాయి, కొన్ని పక్క ట్రాక్ పై పడిపోయాయి. అదే సమయంలో ఆ ట్రాక్ పై వస్తున్న హౌరా ఎక్స్ ప్రెస్ ఈ బోగీలను ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఓవర్‌ హెడ్‌ విద్యుత్‌ తీగలు తెగి బోగీలపై పడ్డాయి. దీంతో కొన్ని బోగీలకు కరెంట్ ప్రసారమైందని, 40మంది వరకు కరెంట్ షాక్ తో చనిపోయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

రంగంలోకి సీబీఐ..

ఈ ప్రమాదంపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అటు సీబీఐ కూడా రంగంలోకి దిగింది. సీబీఐ అధికారుల బృందం ఈరోజు ప్రమాద స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించింది.

Tags:    
Advertisement

Similar News