రైల్వేకు రూ.1.08 లక్షల జరిమానా విధించిన వినియోగదారుల ఫోరం

పిటిషన్‌పై విచారణ చేపట్టిన జిల్లా వినియోగదారులు, వివాదాల పరిష్కార కమిషన్‌.. ఫిర్యాదుదారు లగేజీ కోల్పోయింది మొదలు ఎఫ్‌ఎస్‌ఐఆర్‌ నమోదు వరకు అనేక చోట్ల తిరగాల్సి వచ్చిందని పేర్కొంది.

Advertisement
Update: 2024-06-25 06:20 GMT

ప్రయాణికురాలి లగేజీ చోరీ విషయంలో భారతీయ రైల్వేకు వినియోగదారుల ఫోరం రూ.1.08 లక్షల జరిమానా విధించింది. రైల్వే శాఖ సేవల్లో నిర్లక్ష్యం, లోపాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఫోరం స్పష్టం చేసింది. లగేజీ కోల్పోయిన బాధితురాలికి ఆ సొమ్మును అందజేయాలని సంబంధిత జనరల్‌ మేనేజర్‌ని ఆదేశించింది.

2016 జనవరిలో మాల్వా ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఈ చోరీ జరిగింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రయాణికురాలి లగేజీ ఝాన్సీ నుంచి గ్వాలియర్‌ స్టేషన్ల మధ్యలో చోరీకి గురైంది. తన లగేజీలో రూ.80 వేల విలువైన వస్తువులు ఉన్నాయని పేర్కొంటూ బాధితురాలు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు ప్రయాణికులు, వారి వస్తువుల భద్రత కూడా రైల్వే శాఖ‌దేనని ఆమె ఈ సందర్భంగా వాదించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జిల్లా వినియోగదారులు, వివాదాల పరిష్కార కమిషన్‌.. ఫిర్యాదుదారు లగేజీ కోల్పోయింది మొదలు ఎఫ్‌ఎస్‌ఐఆర్‌ నమోదు వరకు అనేక చోట్ల తిరగాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ వ్యవహారం మొత్తంలో అధికారుల తీరుతో ఆమె అనేక ఇబ్బందులు పడ్డారని, చట్టపరమైన హక్కుల కోసం అనేక వేధింపులకు గురయ్యారని అభిప్రాయపడింది. ప్రయాణికురాలు తన వస్తువుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని, లగేజీ కోసం ప్రత్యేకంగా ఎటువంటి బుకింగ్‌ చేసుకోలేదని రైల్వే శాఖ చేసిన వాదనను కమిషన్‌ తోసిపుచ్చింది. ఈ విషయంలో భారతీయ రైల్వే నిర్లక్ష్యం, సేవా లోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. ఫిర్యాదుదారు కోల్పోయిన వస్తువుల విలువ రూ.80 వేలను తిరిగి పొందేందుకు అర్హురాలని కమిషన్‌ స్పష్టం చేసింది. దీంతోపాటు ఆమెకు కలిగిన అసౌకర్యం, మానసిక వేదనకు పరిహారంగా రూ.20 వేలు, న్యాయ ప్రక్రియ ఖర్చుల కింద మరో రూ.8 వేలు చెల్లించాలని ఆదేశించింది.

Tags:    
Advertisement

Similar News