ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ఆగస్ట్ 5న కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నెల 5వ తేదీన ‘చలో రాష్ట్రపతి భవన్’ తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆ పార్టీ ప్రకటించింది.

Advertisement
Update:2022-07-30 21:39 IST

ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 5న దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు శనివారం ప్రకటించింది. అదే రోజు తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్ నుంచి 'చలో రాష్ట్రపతి భవన్' మార్చ్ నిర్వహిస్తారని కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా, CWC సభ్యులు, ఇతర సీనియర్ నాయకులు కూడా అదే రోజున 'PM హౌస్ ఘెరావ్' కార్యక్రమం నిర్వహిస్తారని కాంగ్రెస్ ప్రకటించింది.

లోక్ స‌భ, రాజ్యసభ కాంగ్రెస్ సభ్యులు 'చలో రాష్ట్రపతి భవన్' నిర్వహిస్తారు. రాష్ట్రాలలో కూడా 'రాజ్ భవన్ ఘెరావ్' నిరసన ప్రదర్శనను నిర్వహిస్తారు. దీనిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర‌ సీనియర్ నేతలు పాల్గొంటారు.

ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ఈ వారం పార్లమెంటు ఉభయ సభల్లో అనేక సార్లు గందరగోళం నెలకొన్నది. చర్చకు స్పీకర్ అనుమతించకపోవడం, విపక్షాలు నిరసనలు తెలపడం నేపథ్యంలో కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో సోమవారం ధరల పెరుగుదలపై చర్చ జరగనుంది, ఆ తర్వాత మంగళవారం రాజ్యసభలో చర్చ జరిగే అవకాశం ఉంది.

జూలై 18న సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లో ధరలు, జీఎస్టీ అంశాన్ని కాంగ్రెస్ నేతలు లేవనెత్తుతూనే ఉన్నారు కానీ ప్రభుత్వం వైపు నుండి స్పందన కరువైంది. 

Tags:    
Advertisement

Similar News