కర్నాటక తర్వాత కాంగ్రెస్ నెక్స్ట్ టార్గెట్ మధ్య ప్రదేశ్
కర్నాటక ప్రజల్లాగే మధ్యప్రదేశ్ ప్రజలు కూడా ఈసారి ఆ ద్రోహానికి బదులు తీర్చుకుంటారని, కాంగ్రెస్ కి క్లియర్ విక్టరీ అందిస్తారని ఆ పార్టీ నమ్ముతోంది.
కర్నాటకలో ఘన విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు తన ఫోకస్ అంతా మధ్యప్రదేశ్ పై పెట్టింది. ఈ ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా అధికారం తమదేనంటున్నారు రాహుల్ గాంధీ. 230 స్థానాల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 150 స్థానాలు తమవేనంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా మధ్యప్రదేశ్ నాయకులతో ఎన్నికల సన్నద్ధత గురించి చర్చించారు రాహుల్ గాంధీ. మాజీ సీఎం, మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్ నాథ్ సారథ్యంలో ఎన్నికల్లో విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. కర్నాటక రిజల్ట్ మధ్యప్రదేశ్ లో రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.
కర్నాటకతో పోలిక ఎందుకంటే..?
కర్నాటక, మధ్యప్రదేశ్ రెండు చోట్లా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బొటాబొటి మెజార్టీతో గెలిచి ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసింది. అయితే రెండుచోట్లా బీజేపీ ప్రలోభాలకు తెరతీసింది. కర్నాటకలో కాంగ్రెస్ కూటమిని కూలదోసి బీజేపీ గద్దెనెక్కింది. 2023లో సీన్ రివర్స్ అయింది. ఈ సారి కూలదోసే అవకాశం లేకుండా కాంగ్రెస్ క్లియర్ విక్టరీ సాధించింది. మధ్యప్రదేశ్ లో కూడా 2018లో కాంగ్రెస్ కి 114 సీట్లు వచ్చాయి. ఎలాగోలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ మధ్యలో బీజేపీ కుట్రకు సీఎం కమల్ నాథ్ బలయ్యారు. ఏడాదిన్నరలోనే కమల్ నాథ్ ని దింపేసింది బీజేపీ. కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేశారు. 21మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట బీజేపీలోకి నడిచారు. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం అయ్యారు. కర్నాటక ప్రజల్లాగే మధ్యప్రదేశ్ ప్రజలు కూడా ఈసారి ఆ ద్రోహానికి బదులు తీర్చుకుంటారని, కాంగ్రెస్ కి క్లియర్ విక్టరీ అందిస్తారని ఆ పార్టీ నమ్ముతోంది.
అంత సీన్ లేదు..
రాహుల్ గాంధీ కలలు కంటున్నట్టు ఈసారి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి అంత సీన్ లేదంటున్నారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. బీజేపీకి కచ్చితంగా 200 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారాయన. కర్నాటకలో గెలిచినంత మాత్రాన అన్నిచోట్లా అధికారం తమదే అనుకోవడం పొరపాటన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం మధ్యప్రదేశ్ పై నమ్మకంగా ఉంది. బీజేపీ కుట్ర రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారనేది హస్తం పార్టీ ఆశ.