నిజాలు మాట్లాడినవారిని సభ నుంచి గెంటేస్తారు.. రాహుల్ సభ్యత్వం రద్దుపై ఖర్గే కామెంట్స్

హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడంతోనే బీజేపీ మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది.

Advertisement
Update:2023-03-24 18:05 IST

నిజాలు ఎవరు మాట్లాడినా.. వారిని పార్లమెంట్‌ నుంచి గెంటేస్తారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్ సభ సచివాలయం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై ఖర్గే మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ' నిజాలు మాట్లాడే వారిని బీజేపీ సభలో ఉండనివ్వదు. అందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయించింది. అయినా మేము నిజాలు మాట్లాడుతూనే ఉంటాం.

హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడంతోనే బీజేపీ మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మేము ఎవరి బెదిరింపులకు భయపడం. అలాగని మౌనంగా కూడా ఉండం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం సాగిస్తాం. అవసరమైతే జైలుకు కూడా వెళ్లడానికి సిద్ధం' అని ఖర్గే వ్యాఖ్యానించారు.

రాహుల్ బలహీన వర్గాలకు వ్యతిరేకం కాదు

రాహుల్ గాంధీ బలహీన వర్గాలకు వ్యతిరేకం అనే ముద్ర వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఖర్గే మండిపడ్డారు. ఇందులో వాస్తవం లేదని ఆయన చెప్పారు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ బలహీన వర్గాలకు చెందినవారా..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై ఎంతవరకైనా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.

ఈ విషయంలో న్యాయపరంగా రాజకీయంగా ముందుకు వెళ్తామని ఖర్గే చెప్పారు. గత ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కోలార్ లో జరిగిన ఓ రాజకీయ సభలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. దొంగలందరికీ మోడీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటుందో..? అని కామెంట్స్ చేశారు. రాహుల్ చేసిన కామెంట్స్ పై గుజరాత్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

Tags:    
Advertisement

Similar News