నేటి నుంచే 'భారత్ జోడో యాత్ర'.. రోడ్డుపై నడక, రోడ్డు పక్కనే బస
కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు అందించేందుకు ఇవ్వాళ్టి నుంచి 'భారత్ జోడో యాత్ర'ను రాహుల్ కన్యాకుమారిలో ప్రారంభించనున్నారు. నెహ్రూ కుటుంబ వారసులు ఏనాడూ చేయని పాదయాత్రకు రాహుల్ నడుం బిగించారు.
కాంగ్రెస్ పార్టీని గత కొన్ని దశాబ్దాలుగా తమ ఆధీనంలోనే ఉంచుకున్న 'గాంధీ-నెహ్రూ' ఫ్యామిలీకి ఏనాడూ ఇన్ని ఇబ్బందులు, కష్టాలు రాలేదు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. ఇందుకు కారణం 'ఆ కుటుంబమే' అంటూ పలు విమర్శలు వస్తున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు కూడా సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంపై పలు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని వదిలేస్తున్నారు. గత కొన్నేళ్లుగా కేంద్రంలో అధికారం కోల్పోవడమే కాకుండా, రాష్ట్రాల్లో కూడా అత్యంత దయనీయ స్థితిలోకి కాంగ్రెస్ దిగజారింది. ఇప్పటికీ కాంగ్రెస్‌ను నమ్ముకొని ఉన్న నాయకులు, కార్యకర్తల్లో.. ఏదో ఓ రోజు కాంగ్రెస్ తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటుందనే ధీమాతో ఉన్నారు. మరోవైపు దేశంలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కచ్చితమైన ఓటు బ్యాంకు ఉన్నది. వారందరికీ తిరిగి నమ్మకం కలిగించడానికి స్వయంగా సీనియర్ నేత రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు అందించేందుకు ఇవ్వాళ్టి నుంచి 'భారత్ జోడో యాత్ర'ను రాహుల్ కన్యాకుమారిలో ప్రారంభించనున్నారు. నెహ్రూ కుటుంబ వారసులు ఏనాడూ చేయని పాదయాత్రకు రాహుల్ నడుం బిగించారు.
స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా 80 ఏళ్ల క్రితం మహాత్మా గాంధీ 'క్విట్ ఇండియా' ఉద్యమాన్ని సెప్టెంబర్ 7న ప్రారంభించారు. ఆనాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆ ఉద్యమం మొదలైతే.. ఇవ్వాళ మత తత్వ బీజేపీని గద్దె దించడానికి, తిరిగి దేశమంతా ఒక్కటవ్వాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' మొదలు పెడుతున్నారు. బుధవారం సాయంత్రం కన్యాకుమారిలో ప్రారంభమయ్యే ఈ యాత్రలో రాహుల్ వెంట 119 మంది కలిసి నడువనున్నారు. 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా ఈ భారత్ జోడో యాత్ర కొనసాగనున్నది. మొత్తం 3,570 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. కశ్మీరులో ఈ యాత్ర ముగియనున్నది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ పూర్తిగా సిద్ధం అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దారిని మధ్యలో మార్చకుండా అధిష్టానం రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులకు సూచనలు చేసింది.
యాత్రకు ఏర్పాట్లు ఇలా..
కన్యాకుమారిలో ప్రారంభమయ్యే 'భారత్ జోడో యాత్ర'లో రాహుల్ వెంట 119 మంది ఉంటారు. వీరిని భారత్ యాత్రీస్‌గా పిలుస్తున్నారు. ఇప్పటికే వీళ్లందరూ కన్యాకుమారి చేరుకున్నారు. రాహుల్ వెంట పూర్తి యాత్రలో వీళ్లు మాత్రమే ఉంటారు. ఇక ఏ ప్రాంతం గుండా యాత్ర జరుగుతుంటే.. ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు కూడా తాత్కాలికంగా యాత్రలో పాల్గొంటారు. వీళ్లకు ముందుగానే పాస్‌లు మంజూరు చేస్తారు. రాహుల్, భారత్ యాత్రీస్ కోసం మొత్తం 59 కంటైనర్లను బుక్ చేశారు. ఇందులో ఓ కంటైనర్‌లో రాహుల్ బస చేస్తారు. మిగిలిన వాటిలో భారత్ యాత్రీస్ ఉంటారు. ఒక్కో కంటైనర్‌లో 12 మంది నిద్రపోయేలా ఏర్పాట్లు చేశారు. రోడ్ల పక్కనే వంట చేసుకోవడం, స్నానం, ఇతర కార్యక్రమాలు కొనసాగనున్నాయి. యాత్ర సందర్భంగా ఎవరి ఇంటికి వెళ్లే అవకాశం ఉండదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారత్ యాత్రీస్ సగటు వయసు 38 ఏళ్లుగా ఉన్నది. రాజస్థాన్‌కు చెందిన విజేంద్ర సింగ్ మహ్లావత్ (58) అందరి కంటే వయసులో పెద్దవాడు.అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన అజమ్ జంబోల (25), బెమ్ బాయి (25) వయసులో చిన్నవాళ్లు. ఇక మొత్తం 119 మంది భారత్ యాత్రీస్‌లో కేవలం 28 మందే మహిళలు ఉన్నారు.
రాహుల్ వెంట నడిచే ఈ యాత్రీస్‌తో పాటు సెక్యూరిటీ సిబ్బంది, పార్టీ కమ్యునికేషన్ టీమ్, ఫొటోగ్రాఫర్లు, సోషల్ మీడియా సిబ్బంది, మీడియా సిబ్బంది, మెడికల్ సిబ్బంది కలిపి మరో 180 మంది ఉన్నారు. మొత్తం 300 మంది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ వెంట ఉంటారు. ప్రతీ మూడు రోజులకు ఓ సారి వీళ్లందరికీ లాండ్రీ అందుబాటులో ఉంటుంది. రాహుల్ యాత్ర రోజుకు సగటున 22 నుంచి 23 కిలోమీటర్లు కవర్ చేయనున్నది. ఉదయం 7 గంటల నుంచి 10 వరకు కొంత దూరం.. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు మరి కొంత దూరం నడువనున్నారు. కంటైనర్లు యాత్రతో పాటు వెనుక రావు. ఉదయం వారి నడక ప్రారంభానికి ముందే బయలుదేరి తదుపరి బ్రేక్ వద్ద నిలుస్తాయి. ఆ తర్వాత మధ్యాహ్నం నడకకు ముందే బయలుదేరి రాత్రి బస వద్దకు చేరుకుంటాయి.
ఇవ్వాళ షెడ్యూల్ ఏంటి?
రాహుల్ గాంధీ బుధవారం సిరిపెరంబుదూర్ చేరుకుంటారు. రాజీవ్ గాంధీ చనిపోయిన ప్రదేశంలో ఓ గంట సేపు ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం 3.00 గంటలకు కన్యాకుమారి చేరుకుంటారు. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం, కామరాజ్ మెమోరియల్ సందర్శిస్తారు. ఆ తర్వాత గాంధీ మండపానికి రాహుల్ చేరుకుంటారు. అక్కడ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్, చత్తీస్‌గడ్ సీఎం భూపేశ్ బగేల్.. రాహుల్‌కు త్రివర్ణ పతాకాన్ని అందిస్తారు. ఈ రోజు ఎలాంటి పాదయాత్ర ఉండదు. గురువారం ఉదయం నుంచి ఆయన కన్యాకుమారి నుంచి నడక ప్రారంభిస్తారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
తెలంగాణలో ఇలా..
'భారత్ జోడో యాత్ర' తమిళనాడులో కేవలం మూడు రోజుల పాటు మాత్రమే కొనసాగనున్నది. సెప్టెంబర్ 11న కేరళలోకి ప్రవేశించి, ఆ తర్వాత 18 రోజులు ఆ రాష్ట్రంలో పాదయాత్ర జరుగుతుంది. సెప్టెంబర్ 30న కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. ఆ రాష్ట్రంలో సుదీర్ఘంగా 'భారత్ జోడో యాత్ర' నిర్వహించనున్నారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరుగనున్నాయి. ఒక వేళ ఓటింగ్ అనివార్యం అయితే రాహుల్ సహా, యాత్రీస్ అందరూ బెంగళూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకుంటారు.
ఇక అక్టోబర్ 24న 'భారత్ జోడో యాత్ర' తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. 15 రోజుల పాటు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తారు. మక్తల్‌లో రాహుల్ ప్రవేశించిన దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. అలాగే మహారాష్ట్రలోకి ప్రవేశించే ముందు కూడా ఓ భారీ బహిరంగ సభకు కసరత్తు చేస్తున్నారు. 15 రోజుల పాదయాత్ర సందర్భంగా కనీసం 5 భారీ బహిరంగ సభలకు టీపీసీసీ ప్లాన్ చేసింది. అయితే గతంలో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, గజ్వేల్ మీదుగా పాదయాత్ర రూట్ మార్చారు. దీనివల్ల అదనంగా మరో 4 రోజులు రాష్ట్రంలో రాహుల్ ఉండాల్సి వస్తోంది. అందుకే గతంలో రూపొందించిన రూట్ మ్యాప్‌నే ఖరారు చేసినట్లు మంగళవారం కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. తెలంగాణలో యాత్ర కొనసాగే సమయంలో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ సీనియర్లు పాల్గొంటారు. మరో 50 మందికి రాహుల్ వెంట నడవటానికి పాస్‌లు ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తానికి రాహుల్ యాత్ర కారణంగా తెలంగాణ క్యాడర్‌లో ఉత్సాహం వస్తుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది.