రాహుల్ గాంధీ పెళ్లాడేది తమిళనాడు అమ్మాయినే..!

పాదయాత్రలో అన్ని వర్గాల వారిని పలకరిస్తూ, వారి కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు రాహుల్. ఈలోగా ఆయన పెళ్లి ప్రతిపాదన తెరపైకి రావడం ఊహించని పరిణామమే.

Advertisement
Update:2022-09-11 10:41 IST

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మూడోరోజు ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. రాహుల్ ని కలుసుకోడానికి వచ్చిన తమిళనాడు మహిళా కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు.. ఆయన ముందు పెళ్లి ప్రతిపాదన ఉంచారు. తమిళనాడుపై రాహుల్ గాంధీకి ఎంత ప్రేమ ఉందో తమకు తెలుసని, ఆయన ఒప్పుకుంటే తమిళనాడు అమ్మాయిని ఇచ్చి వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ మాటలు విన్న రాహుల్ షాకయ్యారు. ఇదిగో చూడండి అంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఓ ఫొటోని ట్విట్టర్లో ఉంచారు. ఎ హిలేరియస్ మూమెంట్ ఫ్రమ్ థర్డ్ డే అంటూ ఆయన ట్విట్టర్లో రాహుల్ ఫొటోలను ఉంచారు.

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా మార్తాండమ్ లో మహిళా ఉపాధి హామీ కూలీలతో రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. ఇప్పటి వరకూ రాహుల్ పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆయన టీ షర్ట్ పై వైరివర్గం విమర్శలు చేయడం, ఆ తర్వాత మోదీ సూటు గురించి ప్రస్తావించగానే నాలుక కరుచుకోవడం.. ఇలాంటి ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా రాహుల్ పెళ్లి ప్రతిపాదన ఇంతకంటే ఆసక్తికరంగా మారింది. ఈ విషయం స్థానికంగా సంచలనం కాలేదు కానీ, జైరాం రమేష్ ట్వీట్ తో ఇది వార్తల్లోకెక్కింది.

ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళకు చేరింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ యాత్ర మొదలు పెట్టారు. 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా ఈ యాత్ర కొనసాగుతుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. 3570 కిలోమీటర్ల ఈ సుదీర్ఘ పాదయాత్రతో పార్టీకి జవసత్వాలు తేవాలనే ఆలోచనతో ఉన్నారు రాహుల్. అన్ని వర్గాల వారిని ఆయన కలుస్తూ ముందుకెళ్తున్నారు. రోడ్డు పక్కనే ఉన్న టీ షాపులో ఆగి అక్కడి మహిళలతో మాట్లాడుతున్నారు. ఆయన వెంట యువత కూడా పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొంటున్నారు. వంటల ప్రోగ్రామ్స్ చేసే యూట్యూబ్ ఛానెల్స్ నిర్వాహకులతో కూడా ఆయన మాట్లాడారు. పాదయాత్రలో అన్ని వర్గాల వారిని పలకరిస్తూ, వారి కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు రాహుల్. ఈలోగా ఆయన పెళ్లి ప్రతిపాదన తెరపైకి రావడం ఊహించని పరిణామమే.

Tags:    
Advertisement

Similar News