బూటకపు హామీలతో మీ 'ఆకలి' తీర్చుకోండి.. బీజేపీపై రాహుల్ మండిపాటు
కేంద్ర ప్రభుత్వం ప్రజల అత్యవసర వస్తువులపై జీఎస్టీ విధించడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఖండించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను బతకలేని పరిస్థితికి తీసుకెళ్తోందని ఆయన దుయ్యబట్టారు.
ప్రజల నెత్తిన జీఎస్టీ పెట్టి మోడీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. 'శాటిస్ ఫై హంగర్ విత్ తడ్కా ఆఫ్ జూమ్లాస్' (మీ బూటకపు వాగ్దానాల వెల్లువతో మీ ఆకలి తీర్చుకోండి') అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ ని విధించి 'గబ్బర్' 'రెసిపీ' ని చవి చూపిస్తున్నారని, దేశ ప్రజలు ద్రవ్యోల్బణంతో నిత్య పోరాటం చేస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. 'మేక్ లెస్, ఈట్ లెస్, అండ్ శాటిస్ ఫై హంగర్ విత్ ది తడ్కా ఆఫ్ జుమ్లాస్' అని రాహుల్ ధ్వజమెత్తారు. ఫుడ్ ఐటమ్స్ మీద మోడీ సర్కార్ జీఎస్టీ విధించడాన్ని ఆయన తప్పు పడుతూ ... మోడీ మొదట ప్రజలు చెప్పేదేమిటో ఆలకించాలన్నారు. ఆహార పదార్థాలపై జీఎస్టీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కొన్ని నిత్యావసర సరకుల మీద పన్నులు పెంచడం అసలే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రజలకు పెను భారమవుతుందని, ధరలు మరింత పెరుగుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
జీఎస్టీ రేట్లు, ధరల పెరుగుదలపై పార్లమెంటులో అత్యవసరంగా చర్చ జరగాలని కాంగ్రెస్, ఇతర విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఉభయ సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాయి. ఫలితంగా లోక్ సభ, రాజ్య సభ కూడా స్వల్పకాలం పాటు వాయిదా పడుతున్నాయి. అయితే ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వీరి ఆరోపణలను ఖండిస్తూ బీజేపీయేతర రాష్ట్రాల నుంచి కూడా ఆమోదం పొందిన తరువాతే కొన్ని వస్తువులపై 5 శాతం పన్ను విధించినట్టు తెలిపారు. వీటిలో ఏపీ, తెలంగాణ, కేరళ, బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయని ఆమె చెప్పారు. టాక్స్ లీకేజీ కాకుండా చూసేందుకు రాష్ట్రాలు జీఎస్టీకి ముందు ఆహారధాన్యాలపై వ్యాట్ లేదా అమ్మకం పన్ను విధించలేదా అని కూడా ఆమె ట్వీట్ చేశారు. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ కౌన్సిల్ సమావేశానికి అన్ని రాష్ట్రాలూ తమ ప్రతినిధులను పంపాయని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు.
ఏమైనప్పటికీ.. జీఎస్టీ ని రాహుల్ గాంధీ 'గ్రహస్ధి సర్వ నాష్ టాక్స్' అని కసిగా వ్యాఖ్యానించడం విశేషం. ఇది సాధారణ ప్రజలకు ఓపెద్ద దెబ్బ అని ఆయన అభివర్ణించారు.