ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.. రాహుల్ గాంధీ రెడీ..
1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురైన శ్రీ పెరంబుదూర్‌లో ఆయన స్మారకం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. సెప్టెంబర్ 7న ఆ స్మారకం వద్ద రాహుల్ గాంధీ నివాళులర్పించి యాత్ర మొదలు పెడతారు. ఆ తర్వాత తమిళనాడు వ్యాప్తంగా 4 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది.
రాహుల్ గాంధీ రెడీ అయ్యారు. ఆయన రెడీ అయింది కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి అనుకుంటే పొరపాటే. ఆ విషయంలో కాస్త వెనకా ముందూ ఆలోచిస్తున్న రాహుల్, పార్టీని పటిష్టపరిచేందుకు, దేశవ్యాప్తంగా పార్టీకి జవసత్వాలు కలిగించేందుకు `భారత్ జోడో` యాత్ర మొదలు పెట్టడానికి సై అంటున్నారు. సెప్టెంబర్ 7న కన్యాకుమార్ నుంచి `భారత్ జోడో` యాత్ర మొదలవుతుంది. ఈమేరకు దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. `భారత్ జోడో` యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బీజేపీ ముక్త్ భారత్..
గతంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ పిలుపునిచ్చిన బీజేపీ నేతలు.. దాదాపుగా అన్నంత పని చేశారు. ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్‌ని ఖాళీ చేస్తూ వచ్చారు. స్థానిక పార్టీలను బతిమాలి, బామాలి, వీలైతే బెదిరించి, షిండేలాంటి వారి సహకారంతో విడగొడ్డి, పడగొట్టి, తాము అధికారంలోకి వచ్చారు. ఇప్పుడిక బీజేపీ టైమ్ అయిపోయిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. అన్నిచోట్లా ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోందని, బీజేపీ ముక్త్ భారత్‌కి వైరివర్గాలన్నీ సిద్ధమవుతున్నాయని చెబుతున్నారు. దానికి `భారత్ జోడో` యాత్రతో నాంది పలుకుతామంటున్నారు. సెప్టెంబర్ 4న రాంలీలా మైదానంలో.. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించబోతోంది. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. అనంతరం మూడు రోజులకు `భారత్ జోడో` యాత్ర ప్రారంభం అవుతుంది.
1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురైన శ్రీ పెరంబుదూర్‌లో ఆయన స్మారకం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. సెప్టెంబర్ 7న ఆ స్మారకం వద్ద రాహుల్ గాంధీ నివాళులర్పించి యాత్ర మొదలు పెడతారు. ఆ తర్వాత తమిళనాడు వ్యాప్తంగా 4 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. అనంతరం యాత్ర కేరళలో ప్రవేశిస్తుంది. కేరళ తర్వాత ఇతర దక్షిణాది రాష్ట్రాలను కూడా కవర్ చేస్తారు రాహుల్ గాంధీ. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ విముఖత చూపిస్తున్నారంటూ పార్టీ శ్రేణులు దిగాలుపడ్డ వేళ, భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా పార్టీని పటిష్టపరిచేందుకు సిద్ధమవుతున్నారని మాత్రం సంతోషపడుతున్నారు. బీజేపీ స్వయంకృతాపరాథాలతోపాటు, జోడో యాత్ర సక్సెస్ అయి, కాంగ్రెస్‌పై సింపతీ పెరిగితే.. కనీసం మిత్రపక్షాల సహకారంతో అయినా కాంగ్రెస్ కేంద్రంలో పగ్గాలు చేపట్టే అవకాశముంది.