జారిపోతారన్న భయంతో... గోవా నుంచి 5 గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెన్నైకి తరలింపు
గోవా కాంగ్రెస్ లో లుకలుకలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర పార్టీలో చీలిక తలెత్తిందని ఇటీవల వార్తలు రాగా.. తాజాగా 5 గురు పార్టీ ఎమ్మెల్యేలను శనివారం గోవా నుంచి చెన్నైకి తరలించారు.
గోవా కాంగ్రెస్ లో లుకలుకలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర పార్టీలో చీలిక తలెత్తిందని ఇటీవల వార్తలు రాగా.. తాజాగా 5 గురు పార్టీ ఎమ్మెల్యేలను శనివారం గోవా నుంచి చెన్నైకి తరలించారు. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో బీజేపీ వీరికి ప్రలోభాలు చూపి తమ శిబిరంలోకి చేర్చుకోవచ్చునన్న అనుమానాలతో పార్టీ నాయకత్వం ఈ చర్య తీసుకుంది. సంకల్ప్ అమోన్ కర్, ఆల్ట్రన్ డీ కోస్టా, కార్లోస్ ఆల్వెర్స్, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్, యూరీ అలెమో అనే వీరిని చెన్నైకి షిఫ్ట్ చేశారు. వీరిలో సంకల్ప్ అసెంబ్లీలో సిఎల్ఫీ డిప్యూటీ లీడర్ కూడా.. గోవా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఈ అయిదుగురిని చెన్నైకి చేర్చారు. ఈ నెల 18 న రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చకచకా జరిగాయి. వీరంతా నేరుగా గోవా నుంచి విమానంలో చెన్నైకి చేరుకున్నారని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనేందుకు వీళ్ళు తిరిగి గోవా చేరుకుంటారని ఆయన చెప్పారు. అయితే మరో ఆరుగురు ఎమ్మెల్యేలు-దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, దెలిలా లోబో, కేదార్ నాయక్, అలెక్సో సిక్వీరా, రాజేష్ ఫల్ దేశాయ్ ఈ గ్రూపులో లేరని ఆయన వెల్లడించారు. ఈ 5 గురు సభ్యులను ఎందుకు చెన్నైకి తీసుకువెళ్ళారో తనకు తెలియదని మైఖేల్ లోబో అన్నారు. తనను ఆహ్వానించలేదని, చెన్నైకి వీరు ఎందుకు వెళ్లారో తనకు అర్థం కావడం లేదని ఆయన చెప్పారు.
గోవా కాంగ్రెస్ నుంచి సభ్యులెవరైనా తమ పార్టీలో చేరితే 25 కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసినట్టు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పార్టీలో మూడింట రెండు వంతుల చీలిక తెచ్చేందుకు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో యత్నించారని గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ దినేష్ గుండూరావు ఆరోపించారు. అయితే బీజేపీలో చేరే ఉద్దేశం తనకు లేదని మైఖేల్ లోబో స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. పార్టీలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణలపై అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న ఈయనను పార్టీ తొలగించింది. లోబోను, దిగంబర్ కామత్ ను సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ కి పార్టీ పిటిషన్లను కూడా సమర్పించింది.శాసన సభ సమావేశాల ప్రారంభానికి ముందు.. ఈ నెలారంభంలో 5 గురు కాంగ్రెస్ సభ్యులు ఎక్కడో అజ్ఞాత ప్రదేశానికి వెళ్లిన విషయం గమనార్హం.