గర్భా వేడుకలకు ముస్లింలు రావొచ్చు.. కానీ..

విగ్రహారాధనపై విశ్వాసం ఉంటే ముస్లింలు కూడా గర్భా పండళ్లను సందర్శించవచ్చని అన్నారు మంత్రి ఉషా ఠాకూర్. విగ్రహారాధనలో విశ్వాసం ఉన్న ముస్లిం పురుషులు తమ మహిళా కుటుంబ సభ్యులతో కలిసి గర్భా వేడుకలకు రావొచ్చని చెప్పారు.

Advertisement
Update:2022-09-14 11:45 IST

గర్భావేడుకలు లవ్ జీహాద్‌కు వేదికలుగా మారుతున్నాయంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మహిళా మంత్రి ఉషా ఠాకూర్, ఇప్పుడు వాటికి సవరణలు చేశారు. మధ్యప్రదేశ్‌లో గర్భా పండళ్లలోకి ముస్లింలకు ప్రవేశం లేదని, గుర్తింపు కార్డులు చూసి హిందువులకే ప్రవేశం కల్పిస్తామని గతంలో ప్రకటించారు సాంస్కృతిక మంత్రి ఉష. అయితే ఇప్పుడు ముస్లింలకు షరతులతో కూడిన ప్రవేశం ఉంటుందని వివరించారు.

విగ్రహారాధన చేస్తారా..?

విగ్రహారాధనపై విశ్వాసం ఉంటే ముస్లింలు కూడా గర్భా పండళ్లను సందర్శించవచ్చని అన్నారు మంత్రి ఉషా ఠాకూర్. ముస్లింల పవిత్ర గ్రంథం విగ్రహారాధనకు అనుమతిస్తే వారిని గర్భా పండళ్ల వద్ద స్వాగతిస్తామని చెప్పారు. విగ్రహారాధనలో విశ్వాసం ఉన్న ముస్లిం పురుషులు తమ మహిళా కుటుంబ సభ్యులతో కలిసి రావాలన్నారు.

నవరాత్రిలో ప్రేమేంటి..?

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో గర్భా వేడుకలు నిర్వహిస్తారు. అయితే ఈ వేడుకలను లవ్ జీహాద్‌కి ముడిపెట్టడంతో మంత్రి ఉషా ఠాకూర్ పై విమర్శలు చెలరేగాయి. అక్కడితో ఆగకుండా ఐడీ కార్డ్ లు చూపించాలనే షరతుపై కూడా నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఆధ్యాత్మిక ఉత్సవాలలో ప్రేమ వ్యవహారాలను ఎందుకు చొప్పిస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఆమె ఇప్పుడు ముస్లింల ప్రవేశాన్ని స్వాగతిస్తున్నామంటూనే వారు తమ కుటుంబంలోని మహిళలను తీసుకురావాలని షరతు పెట్టారు.

గతంలో కూడా..

2014లో ఎమ్మెల్యేగా ఉన్న ఉషా ఠాకూర్.. గర్భా పండళ్లకు ముస్లింలను హాజరు కానివ్వొద్దంటూ నిర్వాహకులకు లేఖలు రాశారు. ముస్లిం పురుషులు ఒకవేళ వచ్చినా గర్భా నృత్యం చేయకుండా నిరోధించాలన్నారు. హిందూ మహిళలతో వారు మాట్లాడకుండా జాగ్రత్తపడ్డాలని చెప్పారు. ప్రతి ఏడాది గర్భా సమయంలో 4 లక్షల మంది హిందూ బాలికలు లవ్ జీహాద్ కారణంగా ఇస్లాం మతంలోకి మారుతున్నారని గతంలో ఆరోపించారు ఉషా ఠాకూర్. ఇప్పుడు సాంస్కృతిక శాఖ మంత్రిగా విమర్శల డోసు మరింత పెంచారు. వింత వింత కండిషన్లు పెడుతూ అభాసుపాలవుతున్నారు.

Tags:    
Advertisement

Similar News