ఆరోజు సెల్ఫీ పోస్ట్ చేశారా..? మీ సమాచారం గల్లంతైనట్టే జాగ్రత్త..
ఒకరిని చూసి ఒకరు ఇలా సెల్ఫీలు దిగారు, హర్ ఘర్ తిరంగా అనే ప్రభుత్వ వెబ్ సైట్లో పెట్టి దేశభక్తుడంటూ ఓ డిజిటల్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు, దాన్ని వాట్సప్ స్టేటస్ లో పెట్టుకుని మురిసిపోయారు.
మన వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్తే ఏమవుతుందో ఇటీవల లోన్ యాప్ బాధితుల వ్యవహారంలో రుజువైంది. మన ఫొటోలు, ఫోన్ నెంబర్లు, వివరాలు అప్పనంగా ఇతరులకి అప్పగించొద్దంటూ ఓవైపు ప్రభుత్వమే భారీగా ప్రకటనలిస్తోంది, మరి అదే ప్రభుత్వం మన దగ్గర సేకరించిన సమాచారాన్ని మార్కెట్లో వస్తువుగా ప్రదర్శనకు పెట్టడాన్ని ఏమనాలి. స్వాతంత్ర వజ్రోత్సవ వేళ కేంద్రం ఈ తప్పు చేసింది. హర్ ఘర్ తిరంగా అనే వెబ్ సైట్లో అందరి సెల్ఫీలు, ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలు సేకరించింది, అక్కడితో ఆగితే పర్లేదు, ఆ వివరాలన్నీ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి.
స్వాతంత్ర దినోత్సవం రోజున సెల్ఫీ దిగకపోయినా, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోయినా అసలు భారతీయులే కాదన్నట్టుగా వ్యతిరేక ప్రచారం చేశారు. ఒకరిని చూసి ఒకరు ఇలా సెల్ఫీలు దిగారు, హర్ ఘర్ తిరంగా అనే ప్రభుత్వ వెబ్ సైట్లో పెట్టి దేశభక్తుడంటూ ఓ డిజిటల్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు, దాన్ని వాట్సప్ స్టేటస్ లో పెట్టుకుని మురిసిపోయారు. ఇక్కడితో కథ అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. స్వాతంత్ర దినోత్సవం పూర్తయినా ఇంకా ఆ సమాచారం ఆ వెబ్ సైట్ లో ఉంది, అందరికీ అందుబాటులో ఉండిపోయింది. మరిప్పుడు దాని సంగతేంటి..?
.in ఉండాలి కదా .com ఏంటి..?
హర్ ఘర్ తిరంగా అనే వెబ్ సైట్ ను కేంద్ర సాంస్కృతిక శాఖ లాంచ్ చేసింది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే అన్ని వెబ్ సైట్ల సర్వర్లన్నీ nic.in పేరిట భారత్ లోనే ఉంటాయి. అయితే హర్ ఘర్ తిరంగా హోస్టింగ్ సర్వర్ ప్రైవేట్ సంస్థ అయిన అమెజాన్ వెబ్ సర్వర్ పేరిట ఉంది. ఈ సైట్ కార్యకలాపాలను గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న 'తగ్‌బిన్' అనే ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తోంది. సింగపూర్, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న మరికొన్ని కంపెనీలు ఈ వెబ్ సైట్ బ్యాక్ ఎండ్ కు అనుసంధానమయ్యాయి. అంటే ఈ సమాచారం ఏమాత్రం భద్రంగా లేదనే విషయం రుజువైంది.
ఇంకా ఎందుకు..?
హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అయిపోయినా ఇంకా వెబ్ సైట్లో ఫొటోలు, ఫోన్ నెంబర్లు, వారి లొకేషన్ వివరాలు ఎందుకు ఉంచారనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఆగస్ట్ 15 తర్వాత ఈ డేటాను డిలీట్ చేస్తామని చెప్పినా ఇంకా ఆ పని చేయలేదు. ఈ వెబ్ సైట్ ఐపీ అడ్రస్ ఇతర 15 వెబ్ సైట్లకు షేర్ చేశారు. ఇందులో విదేశీ వెబ్ సైట్లు కూడా ఉన్నాయని అంటున్నారు. మైనర్ల వివరాలు ఫొటోలు ప్రచురించబోమని చెప్పారు కానీ, ఈ వెబ్ సైట్ లో చిన్నారుల ఫొటోలు, టీనేజర్ల ఫొటోలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ వివరాలన్నీ మార్ఫింగ్ బ్యాచ్ చేతుల్లోకి వెళ్తే ఎలా..?
మోదీ ప్రచారంకోసం పౌరుల భద్రత పణంగా పెడతారా..?
హర్ ఘర్ తిరంగా వెబ్ సైట్ లో ఉన్న పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నాన్-ప్రాఫిట్ జర్నలిజం ఆర్గనైజేషన్ 'రెస్ట్ ఆఫ్ వరల్డ్' ఈ సంచలన విషయాలను వెలుగులోకి తేవడంతో ఆందోళనలు మరింత పెరిగాయి. మరి ఇప్పటికైనా కేంద్రం తప్పు సరిదిద్దుకుంటుందా.. లేక ఈ సమాచారాన్నంతా ప్రైవేట్ వ్యక్తులకు అందుబాటులోనే ఉంచుతుందా అనేది వేచి చూడాలి.