తెలివిమీరిన కేటుగాళ్ళు.. సబ్బుల్లో డ్రగ్స్ పెట్టి రవాణా.. ముంబై ఎయిర్ పోర్ట్‌లో రూ.33 కోట్ల కొకైన్ స్వాధీనం

ముంబై ఎయిర్ పోర్ట్‌లో రూ.33.6 కోట్ల విలువ చేసే 3.36 కేజీల కొకైన్‌ని అధికారులు సీజ్ చేశారు. డ్రగ్స్ మాఫియా ఎంతో తెలివిగా సబ్బుల్లో కొకైన్ దాచి సరఫరా చేస్తుండగా.. అధికారులు తనిఖీలు జరిపి భారీగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Update:2023-02-02 13:06 IST

పోలీసులు ఎంత నిఘా పెట్టిన కేటుగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతుల్లో డ్రగ్స్ సరఫరా కొనసాగిస్తూనే ఉన్నారు. పోలీసుల కళ్ళు కప్పి దేశంలోని అన్ని నగరాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్‌లో రూ.33.6 కోట్ల విలువ చేసే 3.36 కేజీల కొకైన్‌ని అధికారులు సీజ్ చేశారు. డ్రగ్స్ మాఫియా ఎంతో తెలివిగా సబ్బుల్లో కొకైన్ దాచి సరఫరా చేస్తుండగా అందిన సమాచారం మేరకు అధికారులు తనిఖీలు జరిపి భారీగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కత్తా వంటి మెట్రో నగరాల్లో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా వాళ్ల కళ్ళు కప్పి విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నారు. ఇథియోపియా నుంచి ముంబైకి విమానంలో వస్తున్న ఒక ప్రయాణికుడి వద్ద భారీగా కొకైన్ ఉన్నట్లు డీఆర్ఐ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో అధికారులు విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు.

ప్రతి ప్రయాణికుడి బ్యాగును పరిశీలించారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఒక వ్యక్తిని బ్యాగును చూపెట్టాలని కోరగా.. అతడు నిరాకరించాడు. దీంతో బలవంతంగా అతడి బ్యాగును తెరిచి చూడగా భారీ సంఖ్యలో సబ్బులు కనిపించాయి. ఇన్ని సబ్బులు ఎందుకు తెచ్చుకుంటున్నావు? అని అధికారులు ప్రశ్నించగా అతడు సమాధానం చెప్పడంలో తడబడ్డాడు. దీంతో అతడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

సబ్బుల మైనపు పొర కింద ఏదో పదార్థం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాని గురించి అధికారులు పట్టుబడ్డ వ్యక్తిని ప్రశ్నించగా.. సబ్బుల్లో కొకైన్ పెట్టి అక్రమంగా తరలిస్తున్నట్టు ఒప్పుకున్నాడు. ఇథియోపియా ప్రయాణికుడి నుంచి 16 చిన్న సబ్బు పెట్టెలను స్వాధీనం చేసుకున్నామని, స్వాధీనం చేసుకున్న కొకైన్ 3.36 కేజీలు ఉంటుందని అధికారులు తెలిపారు. దీని విలువ రూ.33.6 కోట్లు ఉంటుందని వారు చెప్పారు. ఇథియోపియా ప్రయాణికుడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News