ఏ నేరస్థుడు, మాఫియా వ్యాపారవేత్తలను బెదిరించలేరు.. యూపీ సీఎం యోగి వ్యాఖ్యలు

వరుస ఎన్‌కౌంటర్లతో యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పోలీసుల సమక్షంలోనే కాల్పులు జరుగుతుంటే ఆపలేకపోయారని, ఇక సాధారణ ప్రజలకు రక్షణ ఎలా కల్పిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు యోగి ఆదిత్యనాథ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

Advertisement
Update:2023-04-18 19:32 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఏ నేరస్థుడు, మాఫియా వ్యాపారవేత్తలను బెదిరించలేరని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లతో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న వేళ యోగి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యోగి ముఖ్యమంత్రి అయ్యాక ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 183 మంది పోలీసుల ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. గతవారం మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్‌ను పోలీసులు కాల్చి చంపగా, అతడి అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్‌లను పోలీసుల సమక్షంలోనే దుండగులు కాల్చి చంపారు.

వరుస ఎన్‌కౌంటర్లతో యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పోలీసుల సమక్షంలోనే కాల్పులు జరుగుతుంటే ఆపలేకపోయారని, ఇక సాధారణ ప్రజలకు రక్షణ ఎలా కల్పిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు యోగి ఆదిత్యనాథ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

టెక్స్ టైల్ పార్కుల స్థాపనకు సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న యోగి మాట్లాడుతూ 2017కు ముందు రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉండేవని చెప్పారు. దీనివల్ల ఉత్తరప్రదేశ్ అల్లర్ల రాష్ట్రం అని అపఖ్యాతి మూటగట్టుకున్నట్లు తెలిపారు. 2012-17 మధ్యకాలంలో రాష్ట్రంలో 700కు పైగా అవాంఛనీయ సంఘటనలు జరుగగా, అంతకుముందు ఐదేళ్ల పాలనలోనూ 300కు పైగా అల్లర్ల ఘటనలు జరిగినట్లు వెల్లడించారు.

తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2017 నుంచి ఇప్పటివరకు ఒక్క అల్లర్ల ఘటన కూడా జరగలేదని, కర్ఫ్యూ విధించాల్సిన అవసరం కూడా రాలేదని యోగి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఇప్పుడు ఏ నేరస్థుడు, మాఫియా వ్యాపారవేత్తలను బెదిరించలేరని సీఎం యోగి వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News