ఈ గవర్నర్ మాకొద్దు.. ఆ తర్వాత మీ ఇష్టం
గవర్నర్ ఆర్ఎన్ రవి తమిళనాడులో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, దానివల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు సీఎం స్టాలిన్.
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు దారుణంగా ఉందనే విషయం తెలిసిందే. స్థానిక ప్రభుత్వాలను వేధించడంలో వారిలో వారే పోటీ పడుతున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని వెంటనే రీకాల్ చేయాలంటూ అధికార డీఎంకే డిమాండ్ చేస్తోంది. తాజాగా మరోసారి రాష్ట్రపతికి సీఎం స్టాలిన్ లేఖ రాశారు. ఆ లేఖను డీఎంకే ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించారు.
విద్వేష కుట్ర..
గవర్నర్ ఆర్ఎన్ రవి తమిళనాడులో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, దానివల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు సీఎం స్టాలిన్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 159 ప్రకారం ప్రమాణం చేసి, పదవి చేపట్టిన తర్వాత దాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. మంత్రి సెంథిల్ బాలాజీని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి, ఆ తర్వాత ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గడం ద్వారా గవర్నర్ ఓ రాజకీయ నాయకుడిలా ప్రవర్తించారని అన్నారు స్టాలిన్.
మీ ఇష్టం..
అన్నా డీఎంకే ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి ఆ పార్టీ నాయకులపై విచారణ విషయంలో గవర్నర్ ఉదారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు సీఎం స్టాలిన్. రాజ్యాంగ పదవికి ఆయన ఏమాత్రం అర్హుడు కాదని స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తిని పదవిలో కొనసాగించడం ఏ మాత్రం సముచితం కాదని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలా? వద్దా? అనే నిర్ణయాధికారం రాష్ట్రపతికే విడిచిపెడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు స్టాలిన్.