ఆ లేఖ వెనుక ఉన్నది సీఎం కేసీఆర్.? విపక్షాలను ఏకం చేసేందుకే వ్యూహాత్మక అడుగు!

ప్రధాని మోడీకి రాసిన లేఖలో సీఎం కేసీఆర్‌దే తొలి సంతకం కావడంతో ఈ చర్చ తెరపైకి వచ్చింది.

Advertisement
Update:2023-03-06 15:29 IST

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ పాలనను ఎండగడుతూ విపక్షాలు ఆదివారం లేఖ రాసిన సంగతి తెలిసిందే. దేశంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 9 మంది ప్రతిపక్ష పార్టీల నేతలు మోడీకి లేఖ రాశారు. ఈ లేఖ వెనుక బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయానికి బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేసే ఉద్దేశంలో భాగంగా కేసీఆర్ ఇలా వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

ప్రధాని మోడీకి రాసిన లేఖలో సీఎం కేసీఆర్‌దే తొలి సంతకం కావడంతో ఈ చర్చ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలు తప్ప.. మిగిలిన విపక్షాల నేతలు, వారి బంధువులపై సీబీఐ, ఈడీ దాడులను ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన తర్వాత.. విపక్షాలు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. లేఖలో సంతకం చేసిన వారిలో నలుగురు సీఎంలు, నలుగురు మాజీ సీఎంలతో పాటు ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. వీళ్లందరూ ఆయా పార్టీలకు అధినేతలు, కీలక నేతలుగా ఉండటం గమనార్హం.

కేంద్ర దర్యాప్తు సంస్థలు, గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగంపై మోడీకి రాసిన లేఖలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ (బీఆర్ఎస్), పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), ఢిల్లీ సీఎం కేజ్రివాల్ (ఆప్), పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (ఆప్), బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ (ఆర్జేడీ), జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా (జేకేఎన్‌సీ), మహారాష్ట్ర మాజీ సీఎంలు శరద్ పవార్ (ఎన్సీపీ), ఉద్దవ్ ఠాక్రే (శివసేన, యూబీటీ), యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ) సంతకాలు చేశారు. రాజకీయ శత్రుత్వంతో కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించడం ప్రజా స్వామ్యానికి మంచిది కాదని.. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వాళ్లు లేఖలో పేర్కొన్నారు.

విపక్షాలు అనైక్యంగా ఉండటం వల్లే చాలా చోట్ల బీజేపీ బలపడుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో లేఖ రాయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. 2024 జనరల్ ఎలక్షన్స్ నాటికి ఒక బలమైన ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని విపక్షాలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ ఏర్పాటు ద్వారా బీజేపీని ఢిల్లీ స్థాయిలో ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్ సిద్ధపడుతున్నారు. అదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో మిత్ర పక్షాలతో పొత్తుకు కూడా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న మిత్ర పక్ష పార్టీలను కలుపుకొని పోయేందుకు.. ఈ లేఖ ఒక నాందిగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా కేసీఆర్‌ను పొగుడుతుంటారు. ఆయన వ్యూహాలు అంత త్వరగా ఎవరికీ అర్థం కావు. కేసీఆర్ మైండ్ నుంచి ఒక ఎత్తుగడ వచ్చిందంటే.. దాని వెనుక ఎన్నో రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు ఈ లేఖ కూడా అలాంటిదే అనే చర్చ జరుగుతోంది. విపక్షాలను ఏకతాటిపై తెచ్చేందుకు ఇది తొలి అడుగని అంటున్నారు. అలాగే ఏప్రిల్‌లో పలు పార్టీల నేతలను హైదరాబాద్‌కు పిలవనున్నారు. ఆ సందర్భంగా కూడా కీలకమైన చర్చలు జరిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా చాలా పార్టీలు ఉన్నాయి. అయితే వీటిలో కేవలం బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ మాత్రమే మోడీపై సూటిగా, ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. మిగిలిన పార్టీలో అంత దూకుడుగా వెళ్లడం లేదు. అందుకే వారిని ఏకం చేసి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరింత దూకుడుగా వెళ్లేలా సిద్ధం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News