ములాయం ఆరోగ్య పరిస్థితిపై సిఎం కెసిఆర్ ఆరా
తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , సమాజ్ వాదీ పార్టీ ఛీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యపరిస్థితిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ కు ఫోన్ చేసిన కేసీఆర్ దసరా తర్వాత స్వయంగా తాను అక్కడికి వస్తానని చెప్పారు.
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి పై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు(కెసిఆర్)వాకబు చేశారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ కు సోమవారంనాడు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దసరా పండుగ తర్వాత స్వయంగా వచ్చి కలుస్తానని అఖిలేశ్ కు చెప్పారు. ములాయం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
ములాయం కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జి అయి ఇంటికి వచ్చారు. నిన్న ఆయనకు శ్వాస తీసుకోవడంవలో తీవ్ర ఇబ్బంది ఏర్పడడంతో మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన ఐసియులో చికిత్స పొందుతున్నారు. ఇంకా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఈ రోజు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి వద్దకు కార్యకర్తలు ఎవరూ రావద్దని, నేతాజీ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని సమాజ్ వాది పార్టీ ట్విట్టర్ హాండిల్ ద్వారా తెలిపింది.
పలువురు రాజకీయ నాయకులు అఖిలేష్ కు ఫోన్ చేసి ములాయం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆస్పత్రి వర్గాలకు ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరారు. అవసరమైన సాయం అందిస్తామని ఆయన అఖిలేష్ కు చెప్పారు.