ఉద్రిక్తల నడుమ పలుమార్లు రీకౌంటింగ్.. 16 ఓట్లతో గెలిచిన బీజేపీ అభ్యర్థి

పలుమార్లు రీకౌంటింగ్ నిర్వహించిన తర్వాత చివరకు బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తి కేవలం 16 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.

Advertisement
Update:2023-05-14 09:06 IST

కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ పూర్తయ్యింది. కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు గెలుచుకొని స్పష్టమైన మెజార్టీతో అధికారం చేపట్టబోతోంది. ఇక బీజేపీ 66 స్థానాలకు, జేడీఎస్ 19 స్థానాలకు పరిమితం అయ్యాయి. ఇతర పార్టీలు 2 సీట్లు గెలుచుకున్నాయి. కాగా, కర్ణాటక ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి అన్ని నియోజకవర్గాల లెక్కింపు సాయంత్రం కల్లా పూర్తయ్యింది. అయితే బెంగళూరులోని జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం మాత్రం ఉత్కంఠత రేకెత్తించింది.

ఇక్కడ విజయం ఎవరిని వరించిందో తెలియక కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు ఆందోళన చెందాయి. ఒకానొక సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొన్నది. పలుమార్లు రీకౌంటింగ్ నిర్వహించిన తర్వాత చివరకు బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తి కేవలం 16 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కౌంటింగ్ ప్రారంభమైన సమయానికే జయనగర్ ఓట్ల లెక్కింపును నగరంలోనీ ఆర్వీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కాలేజీలో చేపట్టారు.

ఇక్కడ ప్రతీ రౌండ్ ముగిసినా.. తేడా మాత్రం అత్యంత స్వల్పంగానే ఉన్నది. అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌమ్యా రెడ్డి స్వల్ప మెజార్టీ సాధించినట్లు ప్రకటించారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. అయితే బీజేపీ పోలింగ్ ఏజెంట్లు మాత్రం రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. దీంతో మరోసారి కౌంటింగ్ చేపట్టక తప్పలేదు. అయితే ఈ సారి బీజేపీకి స్వల్ప మెజార్టీ వచ్చింది. ఇంతలో అక్కడకు వచ్చిన కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మరోసారి కౌంట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల అధికారులు మరోసారి కౌంటింగ్ చేసి.. చివరకు బీజేపీ అభ్యర్థి రామమూర్తి 16 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచినట్లు ప్రకటించారు. కాగా, ఎలక్షన్ అధికారుల తీరుపై డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌమ్యారెడ్డి ఎన్నికల ఫలితాన్ని ఈసీఐ మార్చేసిందని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ మాత్రం రామమూర్తి గెలిచినట్లు తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. సౌమ్యా రెడ్డికి 57,781 ఓట్లు రాగా.. సీకే రామమూర్తికి 57,797 ఓట్లు పోలయ్యాయి.



 


Tags:    
Advertisement

Similar News