భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ పదవీ విరమణ
ఛీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ యూయూ లలిత్ ఈ రోజు పదవీ విరమణ చేశారు. రేపటి వరకు సమయం ఉన్నప్పటికీ రేపు సెలవు కావడంతో ఆయన ఈ రోజే రిటైర్మెంట్ తీసుకున్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఈ రోజు (సోమవారం) పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టులో దాదాపు 37 సంవత్సరాల తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రయాణం మొత్తం తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నారు.
"నేను ఈ కోర్టులో 37 సంవత్సరాలు గడిపాను. ఈ కోర్టులో నా ప్రయాణం కోర్ట్ నంబర్ 1 ద్వారా ప్రారంభమైంది. అప్పటి సిజెఐ వైవి చంద్రచూడ్ ఎదుట హాజరై ఉన్నత న్యాయస్థానంలో నా ప్రస్థానాన్ని ప్రారంభించాను. ఇప్పుడు ఆయన కుమారుడు చంద్రచూడ్ కు నా తర్వాత బాధ్యతలు అప్పగిస్తున్నందుకు సంతోషంగా ఉంది'' అన్నారు జస్టిస్ లలిత్
నిజానికి జస్టిస్ లలిత్ పదవీ కాలం మంగళవారం వరకు ఉన్నది. అయితే మంగళవారంనాడు గురునానక్ జయంతి సందర్భంగా సెలవు కావడంతో ఆయన ఈ రోజే పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన 74 రోజుల పాటు విధుల్లో కొనసాగారు. జస్టిస్ లలిత్ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.