అడవిని దాటి.. అపార్ట్‌మెంట్‌లో చొరబడి.. - కలకలం రేపిన చిరుత సంచారం

చిరుత సంచరిస్తోందని, రాత్రిళ్లు ఒంటరిగా సంచరించవద్దని మైకుల్లో ప్రచారం చేపట్టారు. దాన్ని బంధించేందుకు వలలు, బోనులు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వివరించారు.

Advertisement
Update:2023-10-31 13:15 IST

కర్నాటక రాజధాని బెంగళూరు న‌గ‌ర‌ వీధుల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అడవి నుంచి దారితప్పి నగర శివారులోని నివాస ప్రాంతాల్లోకి వచ్చిన చిరుత ఓ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి.. అక్కడే సంచరించిందన్న సమాచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ చిరుత శని, ఆదివారాల్లో వైట్‌ ఫీల్డ్‌ విభాగంలో కనిపించిందని, సోమవారం ఉదయం హోసూరు రోడ్డు కూడ్లు గేట్‌ చుట్టుపక్కల దర్శనమిచ్చిందని అటవీ అధికారులు చెబుతున్నారు.

అంతేకాదు.. ఓ అపార్ట్‌మెంట్‌లోకి కూడా ప్రవేశించిన చిరుత.. అక్కడి లిఫ్ట్‌ ముందు కాసేపు తచ్చాడిందని, ఆ తర్వాత కొద్దిసేపు మెట్ల వద్ద సంచరించి వెళ్లిపోయిందని సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా గుర్తించిన అపార్ట్‌మెంట్‌వాసులు హడలెత్తిపోతున్నారు.

ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. బొమ్మనహళ్లి పరిధి ఏఈసీఎస్‌ లేఅవుట్, హసపాళ్యలోనూ దాని ఆనవాళ్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు వెంటనే ప్రజలను అప్రమత్తం చేశారు.

చిరుత సంచరిస్తోందని, రాత్రిళ్లు ఒంటరిగా సంచరించవద్దని మైకుల్లో ప్రచారం చేపట్టారు. దాన్ని బంధించేందుకు వలలు, బోనులు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వివరించారు. రాజధాని బెంగళూరు వీధుల్లో చిరుత చక్కర్లు కొడుతోందన్న సమాచారం ఇప్పుడు నగరవాసులను బెంబేలెత్తిస్తోంది.

Tags:    
Advertisement

Similar News