చంద్రుడి ఫొటోలు తీసిన చంద్రయాన్-3 ల్యాండర్ ఇమేజర్

శుక్రవారం సాయంత్రం ల్యాండర్ మాడ్యుల్‌ను డీ బూస్టింగ్ చేసి వేగాన్ని విజయవంతంగా తగ్గించినట్లు ఇస్రో తెలిపింది.

Advertisement
Update:2023-08-18 19:34 IST

చంద్రయాన్-3 జాబిల్లి వైపు విజయవంతంగా దూసుకొని పోతోంది. చంద్రయాన్-3 మాడ్యుల్ నుంచి ప్రొపల్షన్ ఇప్పటికే విజయవంతంగా విడిపోయింది. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో సొంతగా తిరుగుతున్న ల్యాండర్ విక్రమ్.. చంద్రుడి ఉపరితలం ఫొటోలను తీసి పంపింది. ఇప్పటి వరకు 4 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన చంద్రయాన్-3.. మరి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉన్నది.

చంద్రయాన్-3 వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి గురువారం విడిపోయిన ల్యాండర్ ఇప్పుడు సొంతగా చంద్రుడి చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో చంద్రుడి ఉపరితలానికి చెందిన పలు ఫొటోలు తీసి పంపినట్లు ఇస్రో తెలియజేసింది. చంద్రుడిపై ఉన్న బిలాలు ఈ ఫొటోల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా, చంద్రుడిపై ఉన్న ఈ బిలాల పేర్లను కూడా ఉదహరిస్తూ ఇస్రో ఒక వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో విడుదల చేసింది.

ఫ్యాబ్రి, గియార్డనో బ్రునో, హర్కేబి జే తదితర బిలాల ఫొటోలను ల్యాండర్ ఇమేజర్-1 ఫొటోలు తీసింది. ఇందులో గియార్డనోబ్రూనో అనేది చంద్రుడిపై గుర్తించిన అతి పెద్ద బిల్లాల్లో ఒకటి కావడం గమనార్హం. ఇక హర్కేబి జే బిలం దాదాపు 43 కిలోమీటర్లు ఉన్నట్లు ఇస్రో పేర్కొన్నది.

శుక్రవారం సాయంత్రం ల్యాండర్ మాడ్యుల్‌ను డీ బూస్టింగ్ చేసి వేగాన్ని విజయవంతంగా తగ్గించినట్లు ఇస్రో తెలిపింది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌లు ప్రస్తుతం చాలా చక్కగా పని చేస్తున్నాయని ఇస్రో వెల్లడించింది. తాజాగా చేపట్టిన డీబూస్టింగ్‌తో ల్యాండర్ మాడ్యుల్ కక్ష్య 113 km X 157 kmకు తగ్గించుకున్నది. రెండో డీబూస్టింగ్ ప్రక్రియ ఆగస్టు 20 ఉదయం 2 గంటలకు చేపట్టనున్నారు. ఇక అన్నీ అనుకూలిస్తే ఈ నెల 23న సాయంత్రం పూట ల్యాండర్.. దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టనున్నది. 


Tags:    
Advertisement

Similar News