నేడు జీ-20 సన్నాహక సమావేశం.. ఢిల్లీకి వైఎస్ జగన్, చంద్రబాబు

వైసీపీ పార్టీ అధ్యక్షుడి హోదాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు నాయుడుతో పాటు 40 పార్టీల చీఫ్‌లు పాల్గొననున్నారు.

Advertisement
Update:2022-12-05 07:34 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సోమవారం ఒకే వేదికపై కనిపించనున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ప్రతిష్టాత్మక జీ-20 సమావేశాలు ఇండియాలో జరుగనున్నాయి. దీనికి సన్నాహకంగా కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసింది. అన్ని రాజకీయ పార్టీల చీఫ్‌లను ఈ సమావేశానికి కేంద్ర పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఈ అఖిల పక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నది.

వైసీపీ పార్టీ అధ్యక్షుడి హోదాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు నాయుడుతో పాటు 40 పార్టీల చీఫ్‌లు పాల్గొననున్నారు. డిసెంబర్ 1 నుంచి ఇండియా జీ-20 అధ్యక్ష హోదాను పొందింది. రాబోయే ఈ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే విషయాలను అఖిల పక్ష సమావేశంలో చర్చించనున్నారు. అలాగే పార్టీ అధినేతల నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకోనున్నారు. రాబోయే నెలల్లో జీ-20కి సంబంధించి దాదాపు 200 సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నది. ఇందులో ఒక సమావేశానికి హైదరాబాద్ కూడా వేదిక కానున్నది.

పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరవుతానని ప్రకటించారు. అయితే కేవలం టీఎంసీ అధ్యక్షురాలి హోదాలో మాత్రమే వస్తున్నానని.. బెంగాల్ సీఎంగా కాదని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా, గత కొన్నాళ్లుగా ఎదురెదురు పడని జగన్, చంద్రబాబు ఒకే వేదికపై కలవనుండటం ఆసక్తికరంగా మారింది. అయితే జీ-20 సన్నాహక సమావేశానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

2023 సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా కీలకమైన జీ-20 శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించనున్నారు. ఇటీవలే ఇండోనేషియాలోని బాలిలో జరిగిన సమావేశాల ముగింపు సందర్భంగా తర్వాతి అధ్యక్ష బాధ్యతలను ఇండియాకు అందించారు. జీ-20 అంటే ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన, చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల ఉమ్మడి వేదిక. ఇందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు సభ్య దేశాలుగా ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News