విభజన చట్టం హామీ నెరవేర్చడం కుదరదు.. కేసీఆర్, జగన్‌కు కేంద్రం షాక్

ఇరు రాష్ట్రాల్లో సీట్ల పెంపు వల్ల టీఆర్ఎస్, వైసీపీ లాభపడతాయని భావించడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement
Update:2022-07-27 18:05 IST

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఇద్దరికీ కలిపి ఒకే సారి షాక్ ఇచ్చింది. ఇప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంపు ఉండదని తేల్చి చెప్పింది. తమ వద్ద అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని స్పష్టం చేసింది. ఇది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక విధంగా ఎదురు దెబ్బే అనుకోవచ్చు.

ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్‌ 2014 (విభజన చట్టం)లో రాజ్యాంగ నిబంధనలు అనుసరించి ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలని పేర్కొన్నారు. దీని ప్రకారం ఏపీలోని 175 సీట్లు 225కు, తెలంగాణలోని 119 సీట్లు 153కు పెరుగుతాయి. అయితే గత ఎనిమిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ సీట్ల పెంపుపై ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇరు రాష్ట్రాల్లో సీట్ల పెంపు వల్ల టీఆర్ఎస్, వైసీపీ లాభపడతాయని భావించడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం ఉన్న సీట్లు భారీగా పెరగడం వల్ల ఇప్పటికే అధికారంలో ఉన్న రెండు పార్టీలకు లాభం కలుగుతుందని కేంద్రం ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇరు రాష్ట్రాల్లో బీజేపీకి ఆశించినంత పాపులారిటీ, క్షేత్రస్థాయి బలం లేదు. అందుకే గత ఎనిమిదేళ్లుగా ఈ విషయాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం.

తాజాగా సీట్ల పెంపు విషయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంటులో ప్రస్తావించారు. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. ఇప్పట్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఉండదని, తమ వద్ద అలాంటి ప్రతిపాదనలు ఏవీ లేవని చెప్పారు. అసెంబ్లీ సీట్ల పెంపు 2026 తర్వాతే ఉంటుందని తేల్చేశారు. కొత్త జనాభా లెక్కలు పూర్తయిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేశారు.

అంటే, 2023లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ, 2024లో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలతోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇది ఒక రకంగా టీఆర్ఎస్, వైసీపీలకే కాకుండా టీడీపీకి కూడా షాకే అని చెప్పాలి. విడిపోయిన తర్వాత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కూడా సీట్ల పెంపుకోసం చాలానే ప్రయత్నాలు చేశారు. కానీ అప్పుడు కూడా బీజేపీ మొండి చేయి చూపించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్న సీట్లలోనే బీజేపీకి అభ్యర్థులు లేరు. ఇక ఇరు రాష్ట్రాలు కలిపి దాదాపు 90కిపైగా సీట్లు పెరుగుతాయి. ఇక అప్పుడు బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఇరు రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులు ఈ విషయంపై ఇప్పటికే అధిష్టానానికి ఒక నివేదిక ఇచ్చారని.. 2026 తర్వాతే సీట్ల పెంపును చేపట్టాలని అందులో పేర్కొన్నారని తెలుస్తుంది.

ఇక టీఆర్ఎస్, వైసీపీలో టికెట్లను ఆశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్‌లో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ఆశావహులు తయారయ్యారు. ఇది పార్టీకి పలు చోట్ల ఇబ్బందిగా మారింది. అటు వైసీపీలోనూ కొన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సీట్లు పెరిగితే ఈ ఇబ్బందులు తొలగిపోతాయని కేసీఆర్, జగన్ భావించారు. కానీ వారి ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది.

కేసీఆర్ తొలి దఫా అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీ సీట్ల పెంపు కొరకు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే కొత్త రాష్ట్రంలో ఉన్న మిగిలిన సమస్యలపై దృష్టి పెట్టినంతగా.. సీట్ల పెంపుపై పెట్టలేదనే చెప్పాలి. ఇక ఇప్పుడు కేంద్రాన్నికోరదామంటే బీజేపీతో టర్మ్స్ బాగా లేవు. అందుకే కేసీఆర్ ఈ విషయంలో మౌనంగా ఉన్నారు. మరోవైపు సీఎం జగన్ సీట్ల పెంపు విషయంపై ఏనాడూ కేంద్రాన్ని కోరలేదు. కానీ, అడగకపోయినా 2024లోపు నియోజకవర్గాలు పెరుగుతాయనే ఆశలో ఉన్నారు. కొన్ని అంతర్గత సమావేశాల్లో సీట్లు పెరిగే అవకాశం ఉందని కూడా వ్యాఖ్యానించినట్లు సొంత పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ తాజాగా కేంద్రం పార్లమెంటులో చేసిన ప్రకటనతో ఇరు ముఖ్యమంత్రులు నిరాశకు గురయ్యారనే చెప్పవచ్చు.

Tags:    
Advertisement

Similar News