ఇక టోల్ చెల్లింపులన్నీ కెమెరాల ద్వారానే!
రానున్న కాలంలో దేశంలో టోల్ ప్లాజాలే ఉండవు. ఇకపై టోల్ చెల్లింపులన్నీ ఆటోమేటిక్ టోల్ చెల్లింపు పథకం కింద కెమెరాల ద్వారానే జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది.
హైవేలపై టోల్ వసూలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇకపై కొత్త నిర్ణయాలు అమలు చేయనుంది. ఇది అమలులోకి వస్తే రానున్న కాలంలో దేశంలో టోల్ ప్లాజాలే ఉండవు. ఇకపై టోల్ చెల్లింపులన్నీ ఆటోమేటిక్ టోల్ చెల్లింపు పథకం కింద కెమెరాల ద్వారానే జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాతిపదికన దీనిని ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దీనికి సంబంధించి అవసరయ్యే చట్టపరమైన మార్పులు చేస్తామని చెప్పారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే టోల్ చెల్లింపులు శరవేగంగా పూర్తి కానున్నాయి. ఇక వాహనాలు జామ్ అయ్యే పరిస్థితి ఎక్కడా ఉండదు.
2021 ఫిబ్రవరి 16 నుంచి ఫాస్టాగ్‌లను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు అమలులో ఉన్న ఫాస్టాగ్ వల్ల టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్య చాలావరకు తగ్గింది. దీని ద్వారా ఒక వాహనం టోల్ ప్లాజాను దాటడానికి సగటున 47 సెకన్ల సమయం పడుతుంది. ఈ విధంగా గంటలో 260 వాహనాల వరకు ప్రాసెస్ చేసే అవకాశముంది. మరోవైపు మాన్యువల్ టోల్ కలెక్షన్ లేన్ గంటలో 112 వాహనాలను మాత్రమే ప్రాసెస్ చేస్తుంది. దేశంలో 97 శాతం టోల్ వసూళ్లు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. కేవలం 3 శాతం మాత్రమే నగదు, కార్డుల ద్వారా టోల్ వసూలు జరుగుతోంది. అయితే ఫాస్టాగ్‌లతో కొన్ని సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. బ్యాలెన్స్ తక్కువ ఉన్న వినియోగదారులు ప్లాజా లేన్‌లోకి ప్రవేశించడం వల్ల రద్దీ ఏర్పడుతోంది. వీటన్నింటి వల్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. తాజా నిర్ణయం ద్వారా అమలు చేసే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్లతో ఈ సమస్యలు దాదాపు తగ్గిపోతాయని భావిస్తున్నారు.
ఇదీ ప్రభుత్వ ప్రణాళిక..
నూతన విధానంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. వాహనాలకు ఆయా కంపెనీలు బిగించే నంబర్ ప్లేట్లకు సంబంధించి 2019లో ప్రభుత్వం ఒక నియమాన్ని జారీ చేసింది. ఇదే విధానంలో గత నాలుగేళ్లలో వచ్చిన వాహనాలన్నింటికీ కంపెనీ నంబర్ ప్లేట్లను అమర్చారు. ఇప్పుడు టోల్ ప్లాజాలను తొలగించి ప్రత్యేక కెమెరాల ద్వారా ఈ నంబర్ ప్లేట్ల సమాచారంతో వాటి వాహనాలకు జోడించిన బ్యాంకు అకౌంట్ల నుంచి టోల్ చార్జీ వసూలుకు చర్యలు చేపట్టనుంది. ఈ పథకం అమలులో భాగంగా కెమెరా ద్వారా టోల్ చెల్లించని వారికి శిక్ష విధించేందుకు కొత్త చట్టాలను తీసుకురావాల్సి ఉంటుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.