ఎయిర్ బ్యాగ్ లపై తూచ్.. ఆ నిర్ణయం ఏడాదిపాటు వాయిదా..

అక్టోబర్-1నుంచి అమ్ముడయ్యే కొత్త కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్ లు తప్పనిసరి అంటూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం సడన్ గా ఒకరోజు ముందు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. నెల, రెండు నెలలు కాదు.. ఏకంగా ఏడాదిపాటు వాయిదా వేసింది.

Advertisement
Update:2022-09-30 08:16 IST

ఈ మధ్య సైరస్ మిస్త్రీ కారు ప్రమాదం తర్వాత కార్లలో ఎయిర్ బ్యాగ్ ల విషయం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఆ ప్రమాదంలో ముందు సీట్లలో ఉన్న ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, వెనక ఉన్న సైరస్ మిస్త్రీ, మరోవ్యక్తి స్పాట్ లో చనిపోయారు. వెనక సీట్లకు కూడా ఎయిర్ బ్యాగ్ లు ఉండి ఉంటే వారు కూడా ప్రాణాలతో బయటపడి ఉండేవారని తెలుస్తోంది. విదేశాల్లో కార్లలో వెనక సీట్లకు కూడా ఎయిర్ బ్యాగ్ లు ఉంటాయి. కానీ అవే కంపెనీలు భారత్ కి పంపించే మోడల్స్ కి మాత్రం ఎయిర్ బ్యాగ్ లు ఉండవు. ఇదెక్కడి ఘోరం, భారతీయుల ప్రాణాలంటే అంత చులకనా అంటూ కేంద్రం కస్సుమంది. అక్టోబర్-1 నుంచి కారులో 6 ఎయిర్ బ్యాగ్ లు తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది.

కుదరదంటే కుదరదు..

అక్టోబర్-1నుంచి అమ్ముడయ్యే కొత్త కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్ లు తప్పనిసరి అంటూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం సడన్ గా ఒకరోజు ముందు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. నెల, రెండు నెలలు కాదు.. ఏకంగా ఏడాదిపాటు వాయిదా వేసింది. అంతర్జాతీయంగా చిప్ ల కొరత, ఇతర కారణాల దృష్ట్యా ఆటో మొబైల్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, మూలిగే నక్కపై తాటిపండు వేయలేమని, అందుకే ఈ నిర్ణయాన్ని ఏడాదిపాటు వాయిదా వేస్తున్నట్టు చెబుతోంది కేంద్రం. మరి ఈ ఏడాదిలో ప్రమాదాల కారణంగా గాల్లో కలిసిపోయే ప్రాణాలకు బాధ్యత ఎవరిది..?

ధరలు పెరుగుతాయ్..

దేశంలో ప్రతి ఏటా లక్షకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించేందుకే ఎయిర్ బ్యాగ్ లు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు గతంలో ప్రకటించిన వెంటనే కార్ల తయారీ సంస్థలు అభ్యంతరం తెలిపాయి. కార్ల ధరలు పెరుగుతాయని, డిమాండ్ తగ్గే అవకాశముందని చెప్పుకొచ్చాయి. సడన్ గా నిర్ణయం తీసుకుంటే.. ఇప్పటికే తయారైన కార్ల సంగతేంటని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ సమస్యలు దృష్టిలో ఉంచుకుని ఎయిర్ బ్యాగ్ ల నిర్ణయాన్ని ఏడాదిపాటు కేంద్రం వాయిదా వేసింది. కార్ల సంస్థల యాజమాన్యాల డిమాండ్లకు తలొగ్గింది.

Tags:    
Advertisement

Similar News