న్యాయవ్యవస్థలో కీలక మార్పులు.. - లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023, భారతీయ సాక్ష్య బిల్లు-2023 లను తదుపరి పరిశీలన కోసం పార్లమెంట్ స్థాయీ సంఘానికి పంపిస్తామని పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థలో కీలక మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టింది. బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో కొత్త చట్టాలను ప్రవేశపెట్టేందుకు ఈ బిల్లును రూపొందించింది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో ప్రస్తుత బిల్లు ద్వారా కొత్త చట్టాలను తీసుకురానుంది. ఇందులో భాగంగా పార్లమెంటు సమావేశాల చివరిరోజైన శుక్రవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో మొత్తం 3 బిల్లులు ప్రవేశపెట్టారు.
భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023, భారతీయ సాక్ష్య బిల్లు-2023 లను తదుపరి పరిశీలన కోసం పార్లమెంట్ స్థాయీ సంఘానికి పంపిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో అమిత్ షా మాట్లాడుతూ.. 1850 నుంచి 2023 వరకు దేశంలోని నేర విభాగానికి చెందిన న్యాయ వ్యవస్థ బ్రిటిష్ వారు చేసిన చట్టాల ప్రకారం పనిచేసిందని తెలిపారు. వాటిని ఈ మూడు చట్టాలు భర్తీ చేస్తాయని వివరించారు. ఆంగ్లేయుల పాలనను రక్షించడం, బలోపేతం చేయడం, శిక్షించడమే లక్ష్యంగా వీటిని ప్రవేశపెట్టారని తెలిపారు. బాధితులకు న్యాయం చేయడం వాటి ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుత కొత్త చట్టాలను మాత్రం శిక్ష వేయడం కాదు.. న్యాయం చేయడం లక్ష్యంగా రూపొందించినట్టు వివరించారు. నేరాలను అరికట్టేందుకు శిక్షలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు.