కేంద్రం గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధర
కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణంపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ధరల తగ్గింపు నిర్ణయం ఈ ఏడాది చివర్లో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మేలు చేస్తుందని కేంద్రం భావిస్తోంది.
దేశ ప్రజలకు కేంద్రప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ ప్రకటన చేసింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు రూ.400, నాన్- ఉజ్వల వినియోగదారులకు రూ.200 తగ్గిస్తున్నట్లు స్పష్టం చేసింది. తగ్గిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. ప్రస్తుతం హైదరాబాద్‌లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1150గా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉజ్వల లబ్ధిదారులకు రూ.750, మిగతా వారికి రూ.950కే సిలిండర్ లభించనుంది. నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ నిర్ణయం ఎంతో ఊరట కలిగించనుంది. ప్రస్తుతం దేశంలో 9 కోట్ల 50 లక్షల మంది ఉజ్వల స్కీం లబ్ధిదారులున్నారు. చివరగా జూలైలో రూ.50, మే నెలలో రెండు సార్లు సిలిండర్ ధరలు పెంచారు.
ఎన్నికల సంవత్సరం కావడంతో ధరల నియంత్రణపై కేంద్రం దృష్టి సారించింది. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలకు జరగనున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణంపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ధరల తగ్గింపు నిర్ణయం ఈ ఏడాది చివర్లో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మేలు చేస్తుందని కేంద్రం భావిస్తోంది.
కర్ణాటకలో ధరల పెరుగుదల అంశాన్ని హైలైట్ చేసింది కాంగ్రెస్. ఇది మహిళా ఓటర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు కర్ణాటకతో పాటు రాజస్థాన్‌లోనూ రూ.500కే సిలిండర్ అందిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఆదివారం మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం శ్రావణ మాసం సందర్భంగా మహిళలకు రూ.450కే సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు.
♦