ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానానికి గడువు పెంచిన కేంద్రం

నిరుడు అగస్టు నుంచే ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి ఆధార్ నెంబర్లను సేకరించడం మొదలు పెట్టింది.

Advertisement
Update:2023-03-22 12:38 IST

ఓటర్ ఐడీతో ఆధార్ కార్డును అనుసంధానం చేసేందుకు గడువును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు 2023 ఏప్రిల్ 1 వరకు మాత్రమే ఈ గడవు ఉన్నది. అయితే ఇంకా చాలా మంది తమ ఓటర్ ఐడీలతో ఆధార్‌ను అనుసంధానం చేయలేదు. దీంతో తాజా గడువును 31 మార్చి 2024 వరకు పెంచుతూ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఓటర్లు ఫామ్ 6-బీ సమర్పించాల్సి ఉంటుంది.

నిరుడు అగస్టు నుంచే ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి ఆధార్ నెంబర్లను సేకరించడం మొదలు పెట్టింది. డిసెంబర్ 12 వరకు 52.32 కోట్ల మంది ఓటర్ల నుంచి ఆధార్ నెంబర్లను సేకరించారు. అయితే.. వీటిని ఇంత వరకు అనుసంధానం మాత్రం చేయలేదు. దీనికి సంబంధించి ఒకరు ఆర్టీఐ దరఖాస్తు చేయగా.. ఇంకా ఓటర్ ఐడీలతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదని చెప్పారు. ఆన్‌లైన్‌లో ఓటర్లు చాలా సులభంగా ఈ ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయవచ్చని అధికారులు అంటున్నారు. నకిలీ ఓటర్లను ఏరి వేయడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

కాగా, పాన్ కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ గత ఏడాది మార్చి 31కే ముగిసింది. ప్రస్తుతం రూ.1000 ఫైన్‌తో అనుసంధానం చేస్తున్నారు. అయితే ఈ అపరాధ రుసుమును ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాసింది. మరో 9 రోజుల్లో ఈ రూ.1000 ఫైన్‌తో కూడా గడువు ముగియనున్నది. ఆ తర్వాత అనుసంధానం చేయని పాన్ కార్డులు పని చేయవు. ప్రతిపక్షలు మాత్రం గడువును మరింతగా పెంచాలని డిమాండ్ చేస్తున్నా.. కేంద్రం మాత్రం ఇంకా స్పందించలేదు. 

Tags:    
Advertisement

Similar News