పారిశ్రామిక మేరు నగధీరుడికి ప్రముఖుల సంతాపం

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా మరణం పట్ల రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement
Update:2024-10-10 09:58 IST

దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మవిభూషణ్‌ గ్రహీత, టాటా సన్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా ముంబాయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా మరణం పట్ల రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

దేశహితం కాంక్షించి రతన్‌ టాటా తన సంపదలో సగానికి పైగా దాతృత్వానికే కేటాయించేవారు. కష్టకాలంలో నేనున్నానంటూ ఆపన్నులకు అండగా నిలిచేవారు. ఆజన్మాంతం దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆచరించి విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో విశేష సేవలు అందించారు. యువత గురించే ఎక్కువగా మాట్లాడే రతన్‌ టాటా సరికొత్త ఆలోచనలకు పునాది వేయాలంటూ విద్యార్థులను అన్నివిధాలుగా ప్రోత్సహించేవారు.

భారత్‌ దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయిందని, రతన్‌ టాటా చేసిన సేవలు ప్రపంచంలోని ఎందరికో స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రతన్‌ టాటా దయగల, అసాధారణ పారిశ్రామికవేత్త అని ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. దేశంలో ప్రతిష్ట్మాత్మక సంస్థకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారన్న మోడీ ఎంతోమందికి ఆయన ఆప్తుడయ్యాడని పేర్కొన్నారు. మెరుగైన సమాజం రతన్‌ టాటా తనవంతు కృషి చేశారని కితాబిచ్చారు. వ్యాపారం, దాతృత్వంలో రతన్‌ టాటా తనదైన ముద్ర వేశారని లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీ గుర్తు చేసుకున్నారు.దేశాభివృద్ధికి రతన్‌టాటా తన జీవితాన్ని నిస్వార్థంగా అంకితం చేశారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ఆయను కలిసిన ప్రతిసారీ దేశం, ప్రజల అభ్యున్నతిపై ఆయన చూపించే నిబద్ధతను తనను ఆశ్చర్యపరిచేది అన్నారు.రతన్‌ టాటా మరణం పట్ల పలువురు కేంద్ర మంత్రులు, పలు పార్టీల అగ్రనేతలు, పలు రాష్ట్రాల సీఎంలు, ఇతర నేతలు సంతాపం ప్రకటించారు. భారత్‌ మాతా ముద్దుబిడ్డల్లో రతన్‌ టాటా ఒకరని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. నిజమైన మానవతావాదిని కోల్పోయామని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తన దృష్టితో ప్రపంచంలో తనదైన ముద్రవేసిన వారిలో రతన్‌ టాటా ఒకరని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సీఎం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రతన్‌ టాటా నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్‌ దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. టాటా ఛారిటబుల్‌ ట్రస్ట్ ద్వారా ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవల అందించారని గుర్తుచేశారు.

రతన్ టాటా మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినే కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా అని కొనియాడారు. సమాజహితుడుగా వారి తాత్వికత, దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శం అన్నారు. నిజమైన ఆవిష్కర్త, అద్భుతమైన మానవుడు, చాలామందికి స్ఫూర్తి, వినయపూర్వకమైన లెజెండ్ అని కేటీఆర్‌ అన్నారు. రతన్ టాటా మరణం వ్యాపార, దాతృత్వం, మానవత్వ ప్రపంచంలో శూన్యాన్ని మిగిల్చిందన్నారు. మేము టీ హబ్‌నును చూసిన ప్రతిసారీ, మేము మిమ్మల్ని గుర్తుంచుకుంటాము సార్ అని కేటీఆర్‌ పోస్ట్‌ చేశార.ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ముఖ్యనేతలు కూడా రతన్‌ టాటా మరణం పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణం భారతదేశానికి తీరనిలోటు అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఏ ప్రకృతి వైపరిత్యం వచ్చినా ముందుండి సాయం అందించే గొప్ప మానవతావాది. ఆయన మరణం బాధాకరమని వారి కుటుంబ సభ్యులకు ఈటల ప్రగాఢ సానుభూతి తెలిపారు. పారిశ్రామికవేత్త రతన్ టాటాకు నివాళులర్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో సంతాప దినం ప్రకటించింది.ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ రతన్‌ టాటా మరణానికి సంతాపంగా ఆ రాష్ట్రంలో ఇవాళ సంతాప దినంగా ప్రకటించారు.

రతన్‌ టాటా మరణం పట్ల దిగ్గజ పారిశ్రామికవేత్తలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గొప్ప మెంటర్‌, మార్గదర్శకులు, మంచి మిత్రుడిని కోల్పోయానని టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. తనకు నిరంతరం స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. తన సమర్థత, సరళత నిత్య నూతన ఆలోచనలతో టాటా గ్రూప్‌ను ప్రపంచ యవనికపై గొప్ప స్థితిలో నిలిపారని కొనియాడారు. రతన్‌ టాటా మృతి దేశానికి తీరని లోటని, తానొక మంచి స్నేహితుడిని కోల్పోయానని, ఆయనను కలిసిన ప్రతి సందర్భంలో తనలో స్ఫూర్తి నింపేదని రిలయన్స్‌ ఇండస్ట్రీ స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ పేర్కొన్నారు. భారత్‌ గొప్ప యోధుడిని కోల్పోయిందంటూ అదానీ గ్రూప్‌ సంస్థల అధిపతి గౌతమ్‌ అదానీ ఎక్స్‌లో తన సంతాపాన్ని ప్రకటించారు. తన విజన్‌ తో ఆధునిక భారత గమనాన్ని రతన్‌ టాటా పునర్‌ నిర్వచించారని కొనియాడారు. రతన్‌ మరణాన్ని అంగీకరించలేకపోతున్నానని మహీంద్రా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దేశ ఆర్థికవ్యవస్థ ప్రస్థానంలో రతన్‌ పాత్ర కీలకమని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో రతన్‌ టాటా అసాధారణ సేవలు అందించారని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కొనియాడారు. రతన్‌ టాటా నైతికతలోనూ, నాయకత్వంలోనూ, దాదృత్వంలోనూ ఓ వెలుగు వెలిగారు. ఆయన వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఆయన జ్ఞాపకాలు మనతో ఎప్పటికీ ఉంటాయని ఆర్పీజీ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ హర్ష్‌ గోయెంకా అన్నారు. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సైతం రతన్‌ టాటా మరణం పట్ల సంతాపం తెలిపారు.

Tags:    
Advertisement

Similar News