100 కోట్లకు గవర్నర్ పదవి లేదా రాజ్యసభ సీటు...!
100 కోట్ల రూపాయలిస్తే గవర్నర్ పదవి, లేదా రాజ్య సభ సీటు ఇప్పిస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ఓ జాతీయ స్థాయి రాకెట్ ను సీబీఐ బహిర్గతం చేసింది.
మోసాలు అనేక రకాలు.... కొత్త కొత్త పద్దతుల్లో కొత్తరకం మోసాలకు పాల్పడుతున్న ముఠాలు దేశంలో పెరిగిపోయాయి. 100 కోట్ల రూపాయలు ఇస్తే గవర్నర్ పదవి లేదా రాజ్యసభ సీటు ఏది కావాలంటే అది ఇప్పిస్తామంటూ ఓ ముఠా చేసిన మోసాలను సీబీఐ బహిర్గతం చేసింది.
మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన కమలాకర్ ప్రేమ్‌కుమార్ బండ్‌గార్, కర్ణాటకలోని బెల్గాంకు చెందిన రవీంద్ర విఠల్ నాయక్, ఢిల్లీకి చెందిన మహేంద్ర పాల్ అరోరా, అభిషేక్ బోరా, మహ్మద్ ఐజాజ్ ఖాన్ లు ఓ ముఠాగా ఏర్పడి ప్రేమ్‌కుమార్ బండ్‌గార్ సీబీఐ అధికారిగా, ఇతరులు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారిగా ప్రచారం చేసుకుంటూ అనేక మందిని మోసం చేశారు.
వీళ్ళు చోటా మోటా రాజకీయ నాయకుల దగ్గరి నుంచి పారిశ్రామిక వేత్తల దాకా అనేక మందిని సంప్రదించారు. వీళ్ళ జాతీయ స్థాయి రాకెట్ గుట్టు విప్పిన సిబీఐ అధికారులు వీళ్ళపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.
"రాజ్యసభ సీటు, గవర్నర్‌గా నియామకం, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఇతర పదవులు, ప్రభుత్వ సంస్థల్లో చైర్మన్‌లుగా నియమిస్తామని తప్పుడు హామీలిచ్చి ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పనిచేశారు." అని సీబీఐ ఎఫ్ ఐ ఆర్ పేర్కొంది.
సీబీఐకి అందిన అత్యంత రహస్య సమాచారం ద్వారా ఈ రాకెట్ ను ఛేధించినట్టు అధికారులు పేర్కొన్నారు. నిందితుల ఇళ్ళపై కూడా సీబీఐ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు.
అయితే ఈ నిందితులను అరెస్టు చేసిందీ లేనిదీ సీబీఐ వెల్లడించలేదు.