దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి

ఓబీసీ ఇంటలెక్చువల్‌ ఫోరం సదస్సులో వక్తలు

Advertisement
Update:2024-12-11 20:20 IST

దేశంలో వెంటనే కులగణన ప్రారంభించాలని బీసీ ఇంటలెక్చువల్స్‌ డిమాండ్‌ చేశారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ చిరంజీవి ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో నిర్వహించిన ఓబీసీ ఇంటెలెక్చువల్‌ ఫోరం సదస్సు రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన బీసీ నాయకులు, ఇతర ముఖ్యులు పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ ఓబీసీ అయి ఉండి కూడా ఓబీసీలకు న్యాయం చేయడం లేదన్నారు. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదని, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడంతో ఓబీసీలకు రాజకీయ ప్రాతినిథ్యం దక్కడం లేదన్నారు. దేశ జనాభాలో 60 శాతానికి పైగా బీసీలే ఉన్నారని, కానీ అన్ని రంగాల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. దేశవ్యాప్తంగా ప్రారంభించబోయే జనాభ గణనలో కేంద్ర ప్రభుత్వం బీసీ గణన చేయాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లో ఓబీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించకుండా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ కోటా అమలు చేయడం సాధ్యం కాదన్నారు. చట్టసభల్లో మహిళ, ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే అప్పటి సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. వచ్చే ఏడాది తెలంగాణ శాసన మండలిలో ఆరు స్థానాలు ఖాళీ అవుతున్నాయని వాటిలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో శాసన మండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌, మాజీ ఎమ్మెల్యేలు పుట్టా మధు, ఈరవత్రి అనిల్‌, నాయకులు దాసోజు శ్రవణ్‌, డాక్టర్‌ సుధాకర్‌, సిద్దేశ్వర్‌, వేలాద్రి తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News