వేలాది గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్.. గుండెపోటుతో మృతి
డాక్టర్ గౌరవ్ గాంధీతో కలిసి పనిచేసే గురు గోవింద్‌సింహ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన డాక్టర్ హెచ్‌కే వాసవాడ ఆయన మృతి సమాచారాన్ని వెల్లడించారు. పెద్ద సంఖ్యలో గుండె ఆపరేషన్లు చేసి ఎందరో ప్రాణాలు కాపాడిన ఆయన.. ఇలా చిన్న వయసులోనే అదే గుండెపోటుతో ప్రాణాలు వదలడం తీవ్ర బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన పేరు డాక్టర్ గౌరవ్ గాంధీ. వయసు 41.. గుజరాత్‌లోని జామ్‌నగర్ నగరంలో ప్రసిద్ధ కార్డియాలజిస్ట్. ఆయన వేలాది మందికి గుండె ఆపరేషన్లు నిర్వహించి వారి ప్రాణాలు కాపాడారు. కానీ చివరికి ఆయన కూడా గుండెపోటుతోనే మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఆ నగరాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సహోద్యోగులు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
డాక్టర్ గౌరవ్ గాంధీతో కలిసి పనిచేసే గురు గోవింద్‌సింహ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన డాక్టర్ హెచ్‌కే వాసవాడ ఆయన మృతి సమాచారాన్ని వెల్లడించారు. పెద్ద సంఖ్యలో గుండె ఆపరేషన్లు చేసి ఎందరో ప్రాణాలు కాపాడిన ఆయన.. ఇలా చిన్న వయసులోనే అదే గుండెపోటుతో ప్రాణాలు వదలడం తీవ్ర బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
బంధువులు, స్నేహితుల కథనం ప్రకారం.. సోమవారం రాత్రి ఎప్పటిలానే ఆస్పత్రిలో పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్న డాక్టర్ గౌరవ్ గాంధీ.. రాత్రి భోజనం చేసి పడుకున్నారు. ఉదయం అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించిన కుటుంబ సభ్యులు అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన్ని బతికించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన గుండెపోటుతో మృతి చెందారని వారు కుటుంబ సభ్యులకు వెల్లడించారు. డాక్టర్ గాంధీకి వృద్ధ తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గుండెపోటు వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి, నివేదిక కోసం వేచి ఉన్నామని ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబుతున్నారు.
కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ గురించి తెలిసినవారు మాట్లాడుతూ.. అతను చురుకైన జీవితాన్ని గడిపాడు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవాడు... అంటూ వివరించారు. ఆయన మృతి వార్త విన్న వందలాదిమంది బుధవారం సాయంత్రం నిర్వహించిన అంతిమ యాత్రలో పాల్గొని నివాళి అర్పించారు.