పాత 500, 1000 నోట్లు ఇప్పుడు చెల్లుతాయా.. సుప్రీంకోర్టుకు ఆర్బీఐ ఏం చెప్పిందంటే!
నోట్ల రద్దు తేదీని ప్రస్తుతం పొడిగించలేమని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి బదులిచ్చారు. కొన్ని ప్రత్యేక కేసుల విషయంలో షరతులకు లోబడి వీటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసి ఇప్పటికి 6 ఏళ్లు గడిచి పోయింది. కానీ డీమానిటైజేషన్‌కు సంబంధించిన కష్టాలు మాత్రం ఇంకా తీరలేదు. చాలా మంది పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోలేక అనేక అవస్థలు పడుతున్నారు. 2016 నవంబర్ 8న నోట్లను రద్దు చేయగా.. అదే ఏడాది డిసెంబర్ 30 వరకు పాత నోట్లను మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఆ సమయంలో పలు కారణాల వల్ల చాలా మంది నోట్లు మార్చుకోలేక పోయారు. అలాంటి వ్యక్తులు, సంస్థలు నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కూడా నోట్ల రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గత వారం విచారణ చేసిన కోర్టు ఆర్బీఐకి పలు కీలక సుచనలు చేసింది.
నోట్లరద్దు సమయంలో పాత కరెన్సీని మార్చుకోలేకపోయిన వారికి ఏవైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా? అని ఆర్బీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిజాయితీగా, సరైన కారణాలతో అప్పట్లో నోట్లను మార్చుకోలేని వారికి ఏదైనా పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని ధర్మాసనం సూచించింది. కోమాలో ఉన్న ఒక మహిళ అప్పట్లో నోట్లు మార్చుకోలేక పోయిందని.. ఆ తర్వాత తనకు స్పృహ వచ్చినా నోట్లను మార్చుకోలేక అవస్థలు పడిన విషయం మా దృష్టికి వచ్చింది. మరి కొంత మంది కూడా నిజాయితీ కలిగిన కారణాలు చూపుతూ మా దగ్గరకు వచ్చారు. అలాంటి వారికి ఏవైనా పరిష్కారాలు ఉంటే సూచించాలని చెప్పారు.
కాగా, నోట్ల రద్దు తేదీని ప్రస్తుతం పొడిగించలేమని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి బదులిచ్చారు. కొన్ని ప్రత్యేక కేసుల విషయంలో షరతులకు లోబడి వీటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇలాంటి వాళ్లు పాత నోట్లను కలిగి ఉంటే తప్పకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. దీనికి త్వరలోనే ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించింది. స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గ్రేస్ పిరియడ్ లోపు రద్దైన నోట్లను జమ చేయలేకపోయిన వారి విషయంలో ఆర్బీఐ తమ సొంత విచక్షణతో సమస్యను పరిష్కరించాలని ధర్మసనం సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది.