సీఏఏ కత్తి వేలాడుతూనే ఉంది... కోవిడ్ మూడో డోస్ పంపిణీ అయిపోగానే అమలుకు ప్రణాళిక‌

Advertisement
Update:2022-08-02 17:22 IST

పౌరసత్వ సవరణ చట్టం(CAA) పై దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన విషయం మర్చిపోలేం. నెలల తరబడి ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పోలీసుల దాడులు, అరెస్టులు, కేసులు...దేశవ్యాప్తంగా పెద్ద అలజడికే దారి తీసాయి. ఆ కేసుల్లో ఇప్పటికీ అనేక‌ మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే దేశాన్ని కరోనా చుట్టుముట్టడంతో అటు నిరసనలు, ఇటు CAA అమలు ఆగిపోయాయి.

ఇంతగా నిరసనలు రావడం వల్ల ఇక బీజేపీ ప్రభుత్వం CAA అమలు చేయకపోవచ్చనే వాదనలు వినబడ్డాయి. కానీ సమయం చూసుకొని మళ్ళీ ఆ అస్త్రాన్ని బైటికి తీయాలని బీజేపీ కాచుకొని ఉంది. ఆ విషయాన్ని మళ్ళొకసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు స్పష్టం చేశారు.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) హామీని వెంటనే అమలు చేస్తామని అమిత్ షా మంగళవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) పశ్చిమ బెంగాల్ యూనిట్‌కు హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు, బిజెపి ఎమ్మెల్యే సువేందు అధికారితో జరిపిన సంభాషణలో షా ఈ విషయాన్ని తెలియజేశారు. కోవిడ్-19 టీకా మూడో డ్రైవ్ పూర్తయిన తర్వాత CAA అమలు చేస్తామని అమిత్ షా సువేందు అధికారికి చెప్పారు. ఈ చట్టానికి సంబంధించిన నియమాలు ఇంకా రూపొందించనప్పటికీ అమలు చేయడానికి బీజేపీ తొందరపడుతోందని దీన్ని బట్టి అర్దమవుతోంది.

CAA అమలు జరిగితే పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి భారీ లాభం చేకూరుతుందని ఆ పార్టీ నాయకుల భావన. అందుకే గత ఏడాది డిసెంబర్‌లో కూడా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుకాంత మజుందార్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రంలో సీఏఏ అమలు చేయాలని కోరింది.

కోవిడ్ -19 మహమ్మారి ముగిసిన తర్వాత చట్టం అమలులోకి వస్తుందని ఈ ఏడాది మేలో జరిగిన ఓ ర్యాలీలో కూడా అమిత్ షా చెప్పారు.

Tags:    
Advertisement

Similar News